బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..మూడు రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..మూడు రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒరిస్సా , పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపు తిరిగి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ గుజరాత్ నుండి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ తో  పాటు ఉత్తర మధ్య మహారాష్ట్ర  మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఇవాళ అనేక చోట్ల , రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) అనేక ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కోమురంభీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలలో ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు (గురువారం) ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్  వాతావరణ శాఖ స్పష్టం చేసింది.