కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్టులో వీళ్లకు చాన్స్

 కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్టులో వీళ్లకు చాన్స్

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ టికెట్ల కసరత్తును మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని హైకమాండ్​, రాష్ట్ర స్థాయిలోని పెద్ద లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పీఏసీ సమావేశంలో సునీల్ కనుగోలు 35 సెగ్మెంట్లలో పార్టీ చాలా వీక్​గా ఉందని రిపోర్టు ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఎలాంటి వివాదాలు లేని 40 మంది అభ్యర్థులను  మొదటి జాబితాలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుకే 80 మందితో ఫస్ట్​ లిస్ట్​ రిలీజ్​చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే ఇటీవల ప్రకటించినా.. అది సాధ్యం కాకపోవచ్చని గాంధీభవన్​ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖరారుపై సెప్టెంబర్​ మొదటి వారంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్​లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే మొదటి జాబితా అనౌన్స్​చేయనున్నట్టు తెలుస్తున్నది. పార్టీ టికెట్ల కోసం గాంధీ భవన్​కు ఆశావహులు క్యూ కడుతున్నారు. రిటైర్డ్​ఆఫీసర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్​ టికెట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వాళ్లు కాంగ్రెస్​ పెద్దలను కోరుతున్నారు. 

అయితే కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్టులో సీనియర్​ లీడర్లకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి (కొడంగల్​), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (కొత్తగూడెం), కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (నల్గొండ), జానారెడ్డి/జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్​), రఘువీర్​ రెడ్డి (మిర్యాలగూడ), ఉత్తమ్ కుమార్​రెడ్డి (హుజూర్​నగర్​), పద్మావతి (కోదాడ), సీతక్క (ములుగు), కొండా సురేఖ (వరంగల్​ఈస్ట్​), చిన్నారెడ్డి (వనపర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్​), వంశీచంద్ రెడ్డి (కల్వకుర్తి), సంపత్​కుమార్ (ఆలంపూర్​), జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (ఆందోల్​), మహేశ్​కుమార్ గౌడ్ (నిజామాబాద్​ అర్బన్​)​, షబ్బీర్​అలీ (కామారెడ్డి), జీవన్ రెడ్డి (జగిత్యాల), శ్రీధర్​బాబు (మంథని), పొన్నం ప్రభాకర్​ (కరీంనగర్​), పొదెం వీరయ్య (భద్రాచలం), బల్మూరి వెంకట్​ (హుజూరాబాద్​) పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. నాగార్జునసాగర్​ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. గిరిజన చైతన్య యాత్ర పేరిట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈసారి నాగార్జునసాగర్​ టికెట్ ​జైవీర్​రెడ్డికేనని ఒకవైపు..  జానారెడ్డికే చాన్స్​ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్​ఉందని మరోవైపు ప్రచారం జరుగుతున్నది.