
ప్రస్తుతం దేశాన్ని చండీపురా అనే వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో చండీపురా వైరస్ అంటే ఏంటి.. దాని లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలో ఆందోళన మొదలైంది. వ్యాధి గురించి పూర్తి సమాచారం మీకోసం..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చాందీపూర్ లో 1966లో ఒకేసారి పెద్దఎత్తున 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోయారు. వైరస్ కారణంగానే పిల్లలు మరణించారని అప్పటి వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ వైరస్‌కు చండీపూర్ వైరస్ అని నామకరణం చేశారు. ఆ తరువాత ఈ వైరస్ 2004 , 2005, 2006, 2019లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించబడింది. చండీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్ అని.. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. దోమలలో కనిపించే ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణమని తెలిపారు. కాగా గత నెలలో గుజరాత్‌లో ఎక్కువ మంది పిల్లల్లో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్యులు తెలిపారు.
చండీపురా వైరస్ లక్షణాలు:
చండీపురా వైరస్ సోకితే పిల్లలకు జ్వరం రావడంతో పాటు విరేచనాలు అవుతాయని డాక్టర్లు తెలిపారు. ఫ్లూ వంటి లక్షణాలతోపాటు మెదడువాపు వ్యాధికి కూడా ఈ వైరస్ దారి తీస్తుందన్నారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.