మిమిక్రీతో ఆకట్టుకుంటున్న చాందినీ భబ్దా

మిమిక్రీతో ఆకట్టుకుంటున్న చాందినీ  భబ్దా

సెలబ్రిటీలను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని వాళ్లలా ఉండాలి అనుకునేవాళ్లు చాలామంది. అయితే ఈ అమ్మాయి మాత్రం వాళ్ల గొంతుని ఇమిటేట్​ చేస్తోంది. పేరు చాందినీ భబ్దా.  స్కూల్ డేస్​ నుంచే మిమిక్రీ చేసేది. ‘కాఫీ విత్ కరణ్​’ ఏడో సీజన్​లో ఆలియాభట్​​ మాట్లాడినట్టే మాట్లాడుతూ వీడియో చేసింది చాందినీ. ఆ వీడియో ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది. ఛాన్స్​ వస్తే బాలీవుడ్​లో నటించేందుకు రెడీ అంటోంది ఈ యంగ్​స్టర్​. ​

సోషల్​మీడియాలో చాంది​నీ వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం ‘ట్రుత్ ఆర్ డేర్’ టాస్క్​లో ఒక పిజ్జా డెలివరీ కంపెనీకి ప్రాంక్​ కాల్ చేసింది. అచ్చం ఆలియాభట్​లా మాట్లాడి పిజ్జా ఆర్డర్​ చేసింది. ఆ వీడియోని యాభై వేలమంది చూశారు. ఆలియా భట్ కూడా ఆ వీడియోని లైక్​ చేసింది. చాందినీకి ఇన్​స్టాగ్రామ్​లో లక్షమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.  

టీచర్ తిట్టింది

ముంబైలో పుట్టిన చాందినీ మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు కంటెంట్ క్రియేటర్, వీడియో జాకీ కూడా. తండ్రి మదన్​ మోహన్ క్రిమినల్ లాయర్. అమ్మ సులోచన  హిందీ టీచర్. చాంది​నీ  ప్రస్తుతం లా చదువుతోంది. చిన్నప్పట్నించి చాంది​నీకి మిమిక్రీ  చేయడం ఇష్టం. స్కూల్లో కూడా టీచర్ల గొంతుని ఇమిటేట్ చేసేది. అది చూసి ఒక టీచర్​ చాంద్​నీని తిట్టింది. దాంతో, కొన్ని రోజులు మిమిక్రీ చేయలేదు.  ఫ్రెండ్స్ అందరూ ‘నీ వాయిస్ అచ్చం ఆలియా భట్​లా ఉంటుంద’ని చెప్పడంతో మళ్లీ మిమిక్రీ చేయడం మొదలుపెట్టింది.  కాలేజీలో చదివే రోజుల్లోనే వాళ్ల అన్నతో కలిసి ఈవెంట్​ కంపెనీలో పనిచేసింది. 2016 లో తన పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టింది.  ఆలియా భట్, కంగనా రనౌత్, ‘తారక్​ మెహతా కా ఉల్టా చష్మా’లోని దయా బెన్ క్యారెక్టర్​ వాయిస్​లని ఇమిటేట్ చేస్తున్న వీడియోలు అందులో పోస్ట్ చేస్తుంటుంది.   

బాలీవుడ్​లోకి వెళ్లాలని...

‘‘ఉదయాన్నే నిద్ర లేవగానే హిందీ పాటలు వింటా. హిందీ సినిమాలు ఎక్కువ చూస్తా. హీరోలు, హీరోయిన్ల మాట తీరు, వాళ్ల సిగ్నేచర్ స్టయిల్​ని బాగా గమనిస్తా. దాంతో వాళ్లని మిమిక్రీ చేయడం ఈజీ అనిపిస్తుంది. నేను మిమిక్రీ ఆర్టిస్ట్​ కావడం అమ్మానాన్నకు ఇష్టం లేదు. కారణం... ‘జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఆన్​లైన్ వేధింపులు ఉంటాయ’నేది వాళ్ల భయం. అలాగని వాళ్లు ఎప్పుడూ నా ఇష్టాన్ని  కాదనలేదు. బాలీవుడ్ సినిమాల్లో లేదా ఓటీటీల్లో అవకాశం వస్తే చేసేందుకు రెడీగా ఉన్నా. యాక్టర్​గా సక్సెస్​ అయ్యేందుకు మిమిక్రీ టాలెంట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నా” అంటోంది ఇరవై రెండేండ్ల  చాంది​నీ.