బాంబులకే భయపడలేదు.... రాళ్లకు భయపడతానా...

బాంబులకే భయపడలేదు.... రాళ్లకు భయపడతానా...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' అంగళ్లు నుంచి పుంగనూరుకు బయల్దేరిన చంద్రబాబు పర్యటనను కొంతమంది  అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీని అడ్డు పెట్టడంతో ... ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు టియర్‌‌గ్యాస్‌ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు లాఠీ ఛార్జిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.


పుంగనూరులోకి చంద్రబాబుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలను పోలీసులు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో వైపు అంగళ్లు నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ వెంట వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

ధైర్యం ఉంటే రండి.. చూసుకుందాం..

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలి. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?, ధైర్యం ఉంటే రండి చూసుకుందాం. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా?, నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టా. పోలీసుల అండతోనే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎవరి జోలికీ మేము పోము.. మా జోలికి వస్తే ఊరుకోం. పుంగనూరు వెళ్తున్నానన్నారు.  ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఇక్కడ జరిగిన ఘటనలో పోలీసుల వైఫ్యలం ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలి. రాబోయే రోజుల్లో వైసీపీని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు. ప్రజలు భూస్థాపితం చేస్తారనే భయంతోనే ఇలా చేస్తున్నారు'' అని చంద్రబాబు మండిపడ్డారు.