వంశీ.. నీది సరైన నిర్ణయం కాదు: రాజీనామాపై చంద్రబాబు స్పందన

వంశీ.. నీది సరైన నిర్ణయం కాదు: రాజీనామాపై చంద్రబాబు స్పందన
  • రాజీనామాలతో రాజకీయ దాడులను ఆపలేం: చంద్రబాబు
  • ఐక్యంగా పోరాడి. కేడర్ కు అండగా ఉండాలని పిలుపు

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ రాజీనామా టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. ఈ నిర్ణయం సరైనది కాదని, రాజీనామాలతో వైసీపీ ప్రతీకార దాడులను ఆపలేమని చెప్పారు. రాజకీయంగా తనపై, అనుచరులపై జరుగుతున్న వేధింపుల వల్లే తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని వంశీ.. ఇవాళ బాబుకు లేఖ పంపారు.

వైసీపీ నాయకులు, కొద్దిమంది ప్రభుత్వ అధికారుల తీరుతో రాజీనామా చేసేయడం సరికాదని వంశీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. టీడీపీ హయంలో పేద, బలహీన వర్గాలకు అండగా ఉన్నామని, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అలాగే కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజకీయాలను విడిచిపెట్టినంత మాత్రాన వైసీపీ ప్రతీకార రాజకీయ చర్యలను ఆపలేరని, రాజీనామా లేదా రాజకీయాల నుంచి వైదొలగడం సరైన పరిష్కారం కాదని తన అభిప్రాయమన్నారు బాబు. వైసీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని, ఇందులో వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ వంశీకి అండ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు సాగుతున్నాయని, వాటిపై ఐక్యంగా పోరాడుదామని, కేడర్ కు అండగా నిలుద్దామని సూచించారు చంద్రబాబు.