చంద్రబాబు గొడగొడ ఏడ్చిండు

చంద్రబాబు గొడగొడ ఏడ్చిండు
  • తన భార్య క్యారెక్టర్​ను కించపరుస్తున్నారని ఆవేదన
  • వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నరు
  • మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడ్తానన్న టీడీపీ చీఫ్​​
  • ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నరు: జగన్

హైదరాబాద్​, వెలుగు: ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్​ చంద్రబాబు నాయుడు గుక్కపట్టి ఏడ్చారు. మీడియా సమావేశంలో భోరున విలపించారు. తన భార్య భువనేశ్వరి క్యారెక్టర్​ను కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభలా మారిందని, రెండున్నరేండ్ల నుంచి తమను బండ బూతులు తిడుతున్నారని, ఇలాంటి పరిణామాలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు.. సభలో జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అంటూ ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భార్య భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదని, ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని ఆమెను టార్గెట్​గా చేసుకొని వైసీపీ లీడర్లు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారంటూ రెండు నిమిషాల పాటు వెక్కి వెక్కి ఏడ్చారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇండ్లలోని వాళ్లను కూడా ఇట్లనే తిడితే ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు. గతంలో వైఎస్​ రాజశేఖర్​రెడ్డి తన తల్లిని అవమానించారని, ఆ తర్వాత తన డిమాండ్​తో క్షమాపణలు చెప్పారని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని పేర్కొన్నారు. ప్రజల పాలిట సీఎం జగన్​ భస్మాసురుడిలా మారారని ఆయన దుయ్యబట్టారు.  

ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నరు: జగన్​
చంద్రబాబు కామెంట్లపై ఏపీ సీఎం జగన్​ స్పందించారు. ‘‘నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌‌గా మాట్లాడుతున్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్‌‌లో ఉన్నారు. చంద్రబాబుకు పొలిటికల్‌‌  ఎజెండానే ముఖ్యం. మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా వైసీపీకి  చెందిన దళితుడు రాబోతున్నారు.. ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌‌లోకి వెళ్లిపోయారు. ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థంకావడం లేదు” అని అసెంబ్లీలో అన్నారు. సంబంధంలేని టాపిక్‌‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని జగన్​ ఆరోపించారు. ఎక్కడ కూడా కుటుంబ సభ్యుల గురించి తమ ఎమ్మెల్యేలు మాట్లాడలేదన్నారు. వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారని, అన్నీ దేవుడు చూస్తాడని జగన్ పేర్కొన్నారు.