
అమరావతి, వెలుగు: ఆంధ్రాలో 3 రాజధానులు నిర్మిస్తామంటున్న సీఎం జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాయలసీమ ప్రజలు రాజధానికి రావాలంటే దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగన్ పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని, ప్రజలే ఆ పిచ్చిని కుదర్చాలని కోరారు. శనివారం అమరావతిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖను రాజధానిగా సూచించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. డబ్బులు తీసుకుని ఎలా కావాలంటే అలా రిపోర్టులు రాసిచ్చే సంస్థ అని ఆరోపించారు. బోస్టన్ కమిటీని ఎప్పుడు, ఏ ప్రాతిపదికన నియమించిందో కూడా ప్రకటించకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. బోస్టన్ కమిటీకి ఓ తలాతోక లేని కమిటీ అని మండిపడ్డారు.
కేంద్రం గుర్తించినా.. కమిటీలా?
సీఎం సలహాదారు అజేయ కల్లం ఏం చెబితే జీఎన్ రావు కమిటీ అదే రాసిచ్చిందన్నారు. బోస్టన్ కమిటీ కూడా అలాగే రిపోర్ట్ రాసిచ్చిందని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించిన తర్వాత కూడా కమిటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు కమిటీలు, నివేదికలతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. బోస్టన్ కమిటీ రిపోర్ట్, రాజధాని తరలిస్తామన్న మంత్రుల ప్రకటనతో రాజధాని పరిధిలోని దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు తీవ్ర ఆవేదనకు గురై గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు బలైతున్నారని విమర్శించారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజధాని తరలింపును ప్రశ్నించిన మహిళా రైతులపై పోలీసులతో దాడి చేయించిందన్నారు. మహిళలపై దాడికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఉన్న భూములను వదిలేసి, విశాఖలో మళ్లీ భూములు సేకరించి రాజధాని కట్టడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా పేర్కొన్న బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఓ చెత్త కాగితంతో సమానమని, సంక్రాంతి భోగి మంటల్లో ఆ రిపోర్టును తగలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.