- బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రంతో చెప్పించి, ఒప్పించే ప్రయత్నం
- నికర జలాల పాలమూరుకు, వరద జలాల బనకచర్లకు లింకేంటని ప్రశ్నిస్తున్న అధికారులు
- ఇందుకు ఒప్పుకుంటే తెలంగాణకు భారీ నష్టం
- అటు ఇచ్చంపల్లికి జీకే లింక్ రాకుండా చక్రం తిప్పుతున్న ఏపీ సీఎం
- పోలవరం నుంచి నల్లమలసాగర్ ద్వారా
- జీసీ లింక్ చేపట్టేలా ఒత్తిళ్లు
హైదరాబాద్, వెలుగు: పోలవరం– బనకచర్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. చేయాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారు. కొత్తగా బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్‌కు బాబు టీమ్ లంకె పెట్టారు. ఏపీ కడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌కు తెలంగాణ ఒకే చెప్తే, మన పాలమూరుకు తాము ఓకే చెప్తామనే సంకేతాలు పంపించారు. ఇందుకు చంద్రబాబు సోమవారం తన ఢిల్లీ పర్యటనను వేదికగా చేసుకున్నారు.
ఈ విషయాన్ని తాను కాకుండా కేంద్రం మంత్రి ద్వారా చెప్పించిన తీరు ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘మీరు పాలమూరు రంగారెడ్డికి ఒకే చెప్పకపోవడం వల్లే పోలవరం నల్లమల సాగర్‌కు తెలంగాణ అంగీకరించడం లేదు.. మీరు పరస్పరం సహకరించుకుంటే ఎలాంటి వివాదాలు ఉండవు..’ అని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది. నికర జలాల ఆధారంగా ఏనాడో మొదలుపెట్టిన పాలమూరుకు, వరద జలాలపై ఆధారపడి కాగితాలు దాటని బనకచర్లకు లింకేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పొరపాటున రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటే గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటాలో భారీ గండిపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
పాలమూరుతో లింకేంటి?
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో బనకచర్ల ప్రాజెక్టును లింకు పెట్టి మాట్లాడడం ఏపీ కుటిల జల రాజకీయాలకు అద్దం పడ్తోందని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మండిపడ్తున్నారు. వాస్తవానికి పోలవరం బనకచర్ల లింకు తాడూ, బొంగరం లేని ఇటీవలి ప్రాజెక్టు. కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 13 ఏండ్ల కింద ఉమ్మడి ఏపీలోనే బీజం పడింది. 2013లోనే నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు జీవో ఇచ్చారు. సర్వేలూ మొదలయ్యాయి. కానీ, రాష్ట్ర విభజన తర్వాత నీటి పంపకాల విషయంలో ఏపీ కొర్రీలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. నాడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టలేదు.
పైగా ఈ ప్రాజెక్టు తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నికర జలాల ఆధారంగానే నిర్మిస్తున్నది. రాష్ట్రంలోని కరువు జిల్లాలైన పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అడుగడుగునా ఏపీ అడ్డుతగులుతూనే ఉంది. చంద్రబాబు హయాంలోనే ఆ ప్రాజెక్టుపై కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కూడా ప్రాజెక్టును ముందు పడనిస్తలేరు. 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన నీళ్లు, మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్ ఆధారంగా పాలమూరుకు కేటాయించారు. కానీ, ఏపీ మాత్రం గోదావరి డైవర్షన్ వాటర్‌పై తేల్చలేదంటూ కేంద్రానికి లేఖలు రాస్తూ కొర్రీలు పెడుతున్నది. కానీ, ఏపీ మాత్రం బనకచర్ల ప్రాజెక్టును వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్నది.
కేంద్రానికి సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లోనూ ఆ విషయాన్ని స్పష్టంగా ఏపీ పేర్కొంది. అసలు దేశంలో ఎక్కడా వరదల జలాల కాన్సెప్టే లేనప్పుడు ఆ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. వరద జలాల పంపిణీనే జరగనప్పుడు ఏపీ ఆ జలాలను ఎలా క్లెయిమ్ చేసుకుంటుందని మిగిలిన రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. ఇలా బనకచర్లకు వ్యతిరేకంగా తెలంగాణ కేంద్రం వద్ద బలంగా వాదిస్తుండడంతో దిక్కుతోచని చంద్రబాబు, పాలమూరును అడ్డుపెట్టుకొని బనకచర్లకు అనుమతులు సాధించుకోవాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జీసీ లింక్‌పైనా అవే కుట్రలు..
నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)లో భాగంగా కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గోదావరి కావేరి లింక్‌నూ తీసుకున్నది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించి 148 టీఎంసీల నీటిని సాగర్‌కు తరలించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లా వాడుకోవాలని ప్రతిపాదించారు. అక్కడి నుంచి మళ్లీ పెన్నా బేసిన్ ద్వారా కావేరి నదికి మళ్లించాలని కసరత్తులు జరుగుతున్నాయి. కానీ, దానికి కూడా ఏపీ మోకాలడ్డుతున్నది.
చంద్రబాబు మద్దతుపై కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా తన బలహీనత నేపథ్యంలో ఏపీ చెప్పినదానికల్లా ఊ కొడ్తున్నది. గోదావరి కావేరి లింక్‌ను ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచే చేపట్టాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఇప్పుడు కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పింది. గోదావరి కావేరి లింక్‌ను తెలంగాణ, ఏపీ నుంచి చేపడుతామని స్పష్టం చేసింది. అయితే, తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి నీటిని తరలిస్తామని కేంద్ర మంత్రి సీఆర్పాటిల్తాజాగా పేర్కొన్నారు.
అదే సమయంలో ఏపీకి సహకరించేలా పోలవరం నల్లమల సాగర్ లింక్‌ను చేపట్టి.. గోదావరి నుంచి కావేరికి నీళ్లు తరలిస్తామని పేర్కొన్నారు. అంటే ఇక్కడ తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీళ్లలో గండి కొట్టబోతున్నారు. ఇచ్చంపల్లి నుంచే నేరుగా చేపడితే 148 టీఎంసీలను తరలిస్తారు. దాని ద్వారా మనకు కనీసం 40 శాతం నీళ్లైనా దక్కుతాయి. కానీ, సమ్మక్కసాగర్ నుంచి చేపడితే మాత్రం ఇక్కడి నుంచి తరలించే నీళ్లలో కోత పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు కేవలం 49 టీఎంసీల జలాలకే అనుమతి ఉన్న నేపథ్యంలో.. మన వాటాకు భారీగా గండి పడడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పోలవరం నల్లమలసాగర్ నుంచి మాత్రం 200 టీఎంసీల వరకు తరలించుకునేందుకు ఏపీకి అవకాశం దక్కుతుంది. పైగా కేంద్రం నుంచే ఆ ప్రాజెక్టుకు పైసలు వచ్చి ఖర్చు లేకుండా ఏపీ బయటపడుతుందన్న చర్చ జరుగుతున్నది. ఇటు సమ్మక్కసాగర్ నుంచి చేపట్టే లింక్ ద్వారా సాగర్‌లో ఎలాగూ గోదావరి నీళ్లు కలుస్తాయి. సాగర్ నుంచి కూడా ఏపీ ఆ నీళ్లను తరలించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
అగ్రిమెంట్ చేస్కుంటే అంతే..
పాలమూరుకు ఓకే చెప్పి తెలంగాణ అనుమతితో బనకచర్ల ప్రాజెక్టుకు అగ్రిమెంట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచిత సలహా ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం అనాలోచితంగా ఏపీతో అగ్రిమెంట్ చేసుకుంటే మాత్రం మన హక్కులకు తీవ్రమైన భంగం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 1976లో శ్రీశైలం నుంచి చెన్నై డ్రింకింగ్ వాటర్ పేరిట 1500 క్యూసెక్కులను తరలించేందుకు కెనాల్నిర్మాణానికి అంగీకరిస్తే ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టును కబ్జా పెట్టిన ఏపీ పాలకులు తెలంగాణ నోట్లో మట్టికొట్టారు.
చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో మహారాష్ట్ర, కర్నాటకలూ అగ్రిమెంట్‌పై సంతకం చేశాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయానికి మళ్లించకూడదని అగ్రిమెంట్లో షరతునూ పెట్టాయి. కానీ, కొన్నాళ్లకే సమైక్య పాలకులు ఆ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కారు. కేవలం విద్యుదుత్పత్తి కోసమే వాడాల్సిన ప్రాజెక్టు నీటిని వ్యవసాయ అవసరాలకూ మళ్లించేశారు. తొలుత శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నిర్మిస్తామని ప్రతిపాదించారు.
ఈక్రమంలో ఎస్ఎల్బీసీని పండబెట్టి.. ఎస్ఆర్బీసీని పూర్తి చేసేసుకున్నారు. ఆ తర్వాత తెలుగుగంగ ప్రాజెక్టును కట్టుకున్నారు. అక్కడి నుంచి తొలుత 11500 క్యూసెక్కుల సామర్థ్యంతో 1988లో నాలుగు వెంట్లతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్నిర్మించారు. దానిని ఇప్పుడు 11 వెంట్లకు పెంచి లక్షన్నర క్యూసెక్కులు తరలించేలా విస్తరించేశారు. అంటే శ్రీశైలం నుంచి 1500 క్యూసెక్కులతో మొదలైన అధికారిక ఒప్పందం.. అనధికారికంగా రోజూ లక్షన్నర క్యూసెక్కులు తరలించేలా మారిపోయింది. అక్కడే ఉమ్మడి ఏపీ పాలకుల కుట్రలన్నీ బయటపడ్డాయి.
ఇప్పుడు కూడా ఒకవేళ అగ్రిమెంట్ చేసుకుంటే మళ్లీ అలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యి.. గోదావరిపైనా తెలంగాణ ప్రయోజనాలకు భారీ నష్టం తప్పదనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రెండు టీఎంసీలతో స్టార్ట్ చేసినా.. అది ఎంత వరకు దారి తీస్తుందోనన్న భయాలు వెంటాడుతున్నాయి.
గోదావరిపై ట్రిబ్యునల్‌కూ పట్టు..
ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు గోదావరి నదిపైనా ట్రిబ్యునల్ కావాలంటున్నారు. నిరుడు డిసెంబర్లోనే కేంద్రానికి లేఖ కూడా రాశారు. మన ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, అసలు తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులే లేవని కేంద్రానికి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. గోదావరి నదీ జల వివాదాలపైనా ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ వేస్తే ఏండ్లకొద్దీ కేసులు నడిచి.. తాను ప్రాజెక్టులను అడ్డదారిలో కట్టేసుకోవచ్చన్న కుతంత్రాలను చంద్రబాబు పన్నుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. ఏపీ కడుతున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ఒప్పుకోవాలంటూసాగునీటిపారుదల శాఖలోని ఓ కీలక అధికారి ప్రభుత్వ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఇరిగేషన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సదరు అధికారి వివిధ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్రం ముందు ఈ ప్రతిపాదనే పెడ్తున్నారని, అదే అదునుగా ఏపీ కూడాఇందుకు పట్టుపడుతోందని చెప్తున్నారు. ఇప్పటికైనా సదరు అధికారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సర్కారుపై ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
