తెలంగాణలో పాత పద్ధతిలోనే ఈసీ నియామకం చేపట్టాలి : చంద్రకుమార్

తెలంగాణలో పాత పద్ధతిలోనే ఈసీ నియామకం చేపట్టాలి : చంద్రకుమార్

ఖైరతాబాద్, వెలుగు: భారత ఎన్నికల కమిషన్​నియా మకం పాత పద్ధతిలోనే జరగాలని జాగో  తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. గతంలోలాగే ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్షనేత అధ్యక్షతన ఈసీని ఎంపిక చేయాలని కేంద్రాన్ని కోరారు. శుక్రవారం జేఏసీ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి​– నల్ల చట్టాలను రద్దుచేయాలి– ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్​ సమావేశం జరిగింది. 

జస్టిస్ చంద్రకుమార్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ​మాడభూషి శ్రీధర్​పాల్గొని, మాట్లాడారు. మోదీ సర్కార్​న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. కర్నాటక ఎన్నికల సమయంలో బజరంగ్​దళ్​గురించి మోదీ మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. 

ప్రొఫెసర్ ​పీఎల్ ​విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో  లోక్​సభ సభ్యులను ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు.  వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసమే రామమందిరాన్ని  ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే  రాజ్యాంగాన్నే మార్చేస్తారని చెప్పారు.  సదస్సులో సొగరా బేగం,  విఠల్​, సత్యనారాయణ, కామేశ్వరరావు, సత్తార్, అబ్దుల్లా పాల్గొన్నారు.