
రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌గా చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ ‘ నేను చిన్న సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పి.వాసు గారు డైరెక్టర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది. కంగనా రనౌత్ ఈ సినిమాలో నటిస్తారని తెలియగానే ఆశ్చర్యపోయాను. అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు.
కీరవాణిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వర్క్‌ను ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టే అంత మంచి సంగీతాన్ని అందించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ ఇలాంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు’ అని చెప్పాడు. కంగనా మాట్లాడుతూ ‘నా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ఇలాంటి గొప్ప సినిమా చేయలేదు. లారెన్స్ మాస్టర్ చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు.
వాసు గారి డైరెక్షన్‌లో నటించడం గుడ్ ఎక్స్‌పీరియన్స్’ అని చెప్పింది. దర్శకుడు వాసు మాట్లాడుతూ ‘డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. అలాగే ‘చంద్రముఖి 2’ను రూపొందించాను. ఈ చిత్రాన్ని లారెన్స్‌తో చేస్తున్నామని రజినీకాంత్ గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆయన అన్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత సుభాస్కరన్, నటుడు వడివేలు, సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.