
చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా పంపిన శాటిలైట్లు భూమి ఫొటోలను పంపించాయంటూ ఇటీవల చాలా ఫేక్ ఫొటోలు, న్యూస్ వైరల్ అయ్యాయి. ఐతే… ఆ ఫొటోలు నిజమైనవి కావు అని నిపుణులు ఇప్పటికే ధ్రువీకరించారు. ఇపుడు అధికారికంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో- చంద్రయాన్ 2 పంపిన ఫొటోలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. చంద్రయాన్ 2 ద్వారా చంద్రుడిపైకి సైంటిస్టులు… ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను పంపించారు. అతి త్వరలోనే విక్రమ్.. చంద్రుడిపైకి ల్యాండ్ కాబోతోంది. ఆ తర్వాత రోవర్ అక్కడి ఉపరితలంపై తిరుగుతూ సమాచారం పంపనుంది.
ఆగస్ట్ 2 న చంద్రయాన్ శాటిలైట్ భూ కక్ష్యను నాలుగోసారి పెంచారు. ఆగస్ట్ 6న మరోసారి పెంచడంతో.. అది భూ కక్ష్య అవతలికి చేరుతుంది. ఆ తర్వాత క్రమంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. ఆగస్ట్ 3న శాటిలైట్ లోని విక్రమ్ ల్యాండర్ తీసిన ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. LI4 కెమెరాతో విక్రమ్ ల్యాండర్ ఈ ఫొటోలను తీసిందని ఇస్రో తెలిపింది.
అంతరిక్షంలో అంత దూరం నుంచి చంద్రయాన్ 2 తీసిన భూమి ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. భూమిపై జల, భూభాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.