ఆగస్టు 20న చంద్రయాన్2 లైన్ లోకి…

ఆగస్టు 20న చంద్రయాన్2 లైన్ లోకి…

శ్రీ హరికోట:చంద్రయాన్ ​2 కక్ష్యను తొలిసారి ఇస్రో మార్చింది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్​2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. బుధవారం దాని కక్ష్య ఎత్తును, దూరాన్ని పెంచింది. ముందు అనుకున్నట్టుగానే మధ్యాహ్నం 2.52 గంటలకు ప్రొపల్షన్​ వ్యవస్థలను 48 సెకన్ల పాటు మండించి కక్ష్య ఎత్తును 230 కిలోమీటర్లకు పెంచారు. దాని దూరాన్ని (ఏపొజీ)ని 45,163 కిలోమీటర్లకు పొడిగించారు. రెండో కక్ష్య మార్పును శుక్రవారం తెల్లవారు జామున 1.09 గంటలకు చేయనుంది. ఆ తర్వాతి కక్ష్య మార్పుల షెడ్యూల్​నూ ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 20న చంద్రయాన్​ 2ను చంద్రుడి కక్ష్యలోకి పంపుతామని వెల్లడించింది. 26వ తేదీన 262.9X54,848, 29న మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల మధ్య 281.6X71,341, ఆగస్టు 2న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య 262.1X89,743, ఆగస్టు 6 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల మధ్య 233.2X1,43,953 కక్ష్యలోకి చంద్రయాన్​ 2ను పంపనుంది. 29వ తేదీ వరకు కక్ష్య ఎత్తు పెరిగినా అక్కడి నుంచి ఆగస్టు 2, 6వ తేదీల్లో ఎత్తును తగ్గించనున్నారు. అదే టైంలో భూమి నుంచి చంద్రయాన్​ 2 దూరం (ఏపొజీ) పెరుగుతుంది. మళ్లీ ఆగస్టు 14వ తేదీన స్పేస్​క్రాఫ్ట్​ను చంద్రుడి కక్ష్యలోకి పంపేలా దారి మళ్లిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య స్పేస్​క్రాఫ్ట్​ కక్ష్య ఎత్తును పెంచుతారు. 278.4 కిలోమీటర్ల ఎత్తులో 4,12,505 కిలోమీటర్ల దూరానికి దానిని పంపుతారు. ఆగస్టు 20న పూర్తిగా చంద్రుడి కక్ష్యలోకి స్పేస్​ క్రాఫ్ట్​ను పంపనుంది ఇస్రో.

ఏ పేరు పెడదాం?

సెప్టెంబర్​ 7న చంద్రుడిపై ల్యాండర్​ విక్రమ్​ దిగే ప్రాంతానికి ఏ పేరు పెట్టాలని ఇస్రో సైంటిస్టులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ‘‘మేం మంచి పేర్లను వెతుకుతున్నాం. కొన్ని తీశాం. వాటిలో దేన్నీ ఇంకా ఎంపిక చేయలేదు. ఓ మంచి పేరును మాత్రం పెడతాం. ప్రయోగం సక్సెస్​ అయ్యాకే దాని పేరును బయటకు వెల్లడిస్తాం” అని ఇస్రో చైర్మన్​ కే శివన్​ తెలిపారు. ల్యాండర్​ దిగితే ఆ ప్రాంతం పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారని సమాచారం. చంద్రయాన్​1 ప్రయోగం సందర్భంగా మూన్​ ఇంపాక్ట్​ ప్రోబ్​ క్రాష్​ల్యాండ్​ అయిన ప్రాంతానికి జవహర్​ పాయింట్​ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

తొందరగా కనిపెట్టేస్తయట

చంద్రయాన్​ 2 టార్గెట్​గా పెట్టుకున్న దక్షిణ ధ్రువంపై నీటి జాడను ల్యాండర్​ విక్రమ్​, రోవర్​ ప్రజ్ఞాన్​లు చాలా తొందరగానే కనిపెట్టే అవకాశముందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి గోతుల్లో నీళ్లతో పాటు మరెన్నో ఉన్నాయని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. టన్నుల కొద్ది మంచు గడ్డలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అతి చల్లగా ఉండే చంద్రుడి గోతుల్లో ఉల్కలు, సూర్యుడి రేడియేషన్​కు సంబంధించిన పదార్థాలూ దొరకొచ్చని చెప్పింది. వెయ్యేళ్లలో చంద్రుడి నేలలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. ఉల్కలు ఢీకొట్టడం వల్ల, రేడియేషన్​ వల్ల ఐస్​ గడ్డలు 30 కిలోమీటర్ల మేర చిందరవందరగా పడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగి ఉంటే విక్రమ్​, ప్రజ్ఞాన్​ల పని తేలికవుతుందని  అంటున్నారు.