
- ల్యాండింగ్ ప్రాంతం ఫొటోలు విడుదల.. చీకటిగా ఉందని వెల్లడి
- అక్టోబర్‌లో వెలుతురు వచ్చాక మరోసారి ఫొటోలు తీస్తామన్న సంస్థ
నాసా కంటికీ విక్రమ్ కనిపించలేదు. చంద్రుడి దక్షిణ ధ్రువం మొత్తాన్ని నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) జల్లెడ పట్టినా మన విక్రమ్ జాడ దొరకలేదు. కారణం, అక్కడ మొత్తం ఇప్పుడు చీకటిగా ఉండడమే. కొద్ది రోజుల క్రితం ఆ ఏరియాను నాసా ఆర్బిటర్ ఫొటోలు తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫొటోలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్ 7న సింపెలియస్ ఎన్, మాంజినస్ సీ లోయల మధ్య విక్రమ్ ల్యాండింగ్‌కు ఇస్రో ప్రయత్నించినా అది ఫెయిలైంది. విక్రమ్‌తో లింక్‌ను తిరిగి కలిపేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా కూడా ప్రయత్నించింది. అది ఫలించకపోవడంతో దాని జాడ కనుక్కునేందుకు రెండు అంతరిక్ష సంస్థలు ప్రయత్నించాయి. అందులో భాగంగా చంద్రయాన్ 2 ఆర్బిటర్, నాసా ఆర్బిటర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ కావాల్సిన ప్రాంతాన్ని ఫొటోలు తీశాయి.
ఇస్రో తాను తీసిన ఫొటోలు ఇంకా విడుదల చేయకపోయినా, నాసా మాత్రం శుక్రవారం వాటిని రిలీజ్ చేసింది. దక్షిణ ధ్రువానికి జస్ట్ 600 కిలోమీటర్ల దూరంలోని ఆ రెండు లోయల ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్టు చెప్పింది. చంద్రుడి నేలను విక్రమ్ బలంగా ఢీకొట్టిందని వెల్లడించింది. అయితే, మొత్తం చీకటి ఉండడం వల్ల అక్కడ విక్రమ్ జాడ దొరకలేదని చెప్పింది. దానిని గుర్తించేందుకు అక్టోబర్ 14న మరోసారి ఆ ప్రాంతాన్ని ఆర్బిటర్‌తో ఫొటో తీస్తామని తెలిపింది. ఆ టైంకు అక్కడ వెలుతురు వస్తుందని, అప్పుడు ఫొటోలు తీస్తే విక్రమ్ జాడ దొరికే అవకాశం ఉంటుందని గొడ్డార్డ్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ సైంటిస్ట్, ఎల్ఆర్వో డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ తెలిపారు. ల్యాండింగ్ ప్రాంతాన్ని ఫొటో తీసినప్పుడు మొత్తం చీకటిగా ఉందని, కాబట్టి అక్కడి నేల మొత్తం నీడ చాటున ఉందని నాసా ట్వీట్ చేసింది. బహుశా ఆ నీడల మాటునే విక్రమ్ ఉండి ఉండొచ్చని పేర్కొంది. మళ్లీ అక్టోబర్‌లో ఎల్ఆర్వో ఆ ప్రాంతం మీదుగా వెళుతుందని, అప్పుడు లైటింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి మరోసారి ఫొటోలు తీస్తామని తెలిపింది. వీలైతే విక్రమ్నూ ఫొటోలు తీస్తామని చెప్పింది.