
చంద్రయాన్ 2 శాటిలైట్ అద్భుతానికి మరింత చేరువయ్యింది. చంద్రయాన్ 2 చరిత్రాత్మక ప్రయోగంలో ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ -ఇస్రో మరో కీలక మైలురాయి దాటింది. ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన చంద్రయాన్ 2 శాటిలైట్… చంద్రుడి కక్ష్య వైపుగా పయనిస్తోంది. ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది శాటిలైట్.
ఆగస్ట్ 14న వేకువ జామున ట్రాన్స్ ల్యూనార్ ఇన్సర్షన్ ఆపరేషన్ చేశారు ఇస్రో సైంటిస్టులు. జీఎస్ఎల్వీ మార్క్ 3 లాంచింగ్ వెహికల్ సాయంతో.. జులై 22న మధ్యాహ్నం గం.2.43 నిమిషాలకు చంద్రయాన్ 2 ను నింగిలోకి పంపింది ఇస్రో. శాటిలైట్ భూ కక్ష్యను ఇన్ని రోజులూ పెంచుతూ వెళ్లిన సైంటిస్టులు… ఆగస్ట్ 14న భూ కక్ష్య నుంచి చంద్రయాన్ 2 ను బయటకు పంపి… చంద్రుడి కక్ష్య వైపుగా దాని దిశను మార్చారు. అలా నేరుగా పయనిస్తూ… ఆగస్ట్ 20న చంద్రయాన్ 2.. చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని చెప్పారు. అక్కడ మళ్లీ చంద్రయాన్ 2 వేగాన్ని నియంత్రించి.. చంద్రుడి కక్ష్యలో తిరిగేలా చేస్తారు.
అప్పటినుంచి.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ… కక్ష్యను తగ్గించుకుంటూ.. జాబిల్లికి దగ్గరవనుంది చంద్రయాన్ 2. సెప్టెంబర్ మొదటివారంలో.. ఆర్బిటార్ నుంచి.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఆ తర్వాత… ప్రజ్ఞాన్ రోవర్.. ఏ దేశం అడుగుపెట్టనటువంటి చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలపై కాలుమోపనుంది. అక్కడినుంచి సమాచారం పంపనుంది. జాబిల్లి అడుగుజాడలను వెతికే ప్రయత్నంలో ఇండియా గొప్పవిజయాన్ని సాధించబోతున్నట్టు, చరిత్ర సృష్టించబోతున్నట్టు ఇస్రో చెబుతోంది.