టీఎస్​‑ బీ పాస్ ​అమలులో మార్పులు అవసరం

టీఎస్​‑ బీ పాస్ ​అమలులో మార్పులు అవసరం
  • ప్రభుత్వానికి క్రెడాయ్​ వినతి

హైదరాబాద్​, వెలుగు: కన్​స్ట్రక్షన్​ రంగం కోసం తెచ్చిన టీఎస్–​ బీ పాస్​ విధానంలో కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు క్రెడాయ్ తెలంగాణ​ కొత్త కార్యవర్గం వెల్లడించింది. పాత పద్దతి కొనసాగిస్తూనే, టీఎస్​– బీ పాస్​ అమలు చేయాలని కోరనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు బిజీగా ఉండటంతో టీఎస్​– బీ పాస్​అమలులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పారు. అంతేకాదని, చాలా చోట్ల తగిన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇంకా ఏర్పాటు కాలేదని వివరించారు. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు, సిటీలతో పోలిస్తే రియల్​ ఎస్టేట్​ రంగం హైదరాబాద్​ సహా తెలంగాణలోనే జోరు మీదుందని, ఈ రంగం ఇక్కడ మరింత ఎదుగుతుందనే ఆశాభావం ఉందని పేర్కొన్నారు.

క్రెడాయ్​ తెలంగాణ చైర్మన్​ సీ హెచ్​ రామచంద్రా రెడ్డి, ప్రెసిడెంట్​డీ మురళీ కృష్ణా రెడ్డి, ప్రెసిడెంట్​ ఎలెక్ట్​ ఈ ప్రేమ్​సాగర్​ రెడ్డి, సెక్రటరీ కే ఇంద్ర సేనా రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు బాగా ఎదగడం మన రియల్​ ఎస్టేట్​ రంగానికి కలిసొస్తోందని వారు పేర్కొన్నారు. కన్​స్ట్రక్షన్​కి సంబంధించిన అన్ని రూల్స్​, రెగ్యులేషన్స్​నూ క్రెడాయ్​ మెంబర్స్​ పాటిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుండటంతోనే  ముందుకెళ్లగలుగుతున్నామని ప్రెసిడెంట్​ మురళీ కృష్ణా రెడ్డి చెప్పారు. తెలంగాణలో 33 జిల్లాలుండగా ప్రస్తుతం 11 జిల్లాల్లో క్రెడాయ్​ చాప్టర్లున్నాయని, రాబోయే రెండేళ్లలో మరో 9 జిల్లాలలో చాప్టర్లు ఏర్పాటు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నామని అన్నారు. హైదరాబాద్​ సిటీలో చాలా స్కై స్క్రాపర్లు (ఎత్తైన భవనాలు) వస్తున్నాయని, రియల్​ ఎస్టేట్​, కన్​స్ట్రక్షన్​ రంగం మరింతగా ఊపందుకుంటోందని చైర్మన్​ రామచంద్రా రెడ్డి చెప్పారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్​, నిజామాబాద్​, ఖమ్మం వంటి సిటీలలో కూడా ఈ రంగం దూసుకుపోతోందని పేర్కొన్నారు.