హిందూ అమ్మాయిలే టార్గెట్.. విదేశాల నుంచిరూ.500 కోట్ల ఫండ్స్: బయటపడుతున్న చంగూర్‌ ‌బాబా లీలలు

హిందూ అమ్మాయిలే టార్గెట్.. విదేశాల నుంచిరూ.500 కోట్ల ఫండ్స్: బయటపడుతున్న చంగూర్‌ ‌బాబా లీలలు

లక్నో: లవ్ జిహాద్‎ను ప్రోత్సహిస్తూ ముస్లిం యువకులకు భారీగా డబ్బులు పంచాడని యూపీ స్వయంప్రకటిత బాబా జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం విదేశాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు అందుకున్నాడని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. వారం రోజుల కిందట చంగూర్ బాబాకు చెందిన 4 బ్యాంకు ఖాతాల్లో రూ.106 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో చంగూర్ బాబాను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో బాబా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 

తాజాగా, యూపీలోని పలు జిల్లాల్లో మతమార్పిడులను బాబా ప్రోత్సహించాడని, హిందూ అమ్మాయిలను ఆకర్షించి వారితో మతమార్పిడి చేయించే కుర్రాళ్లకు డబ్బులిచ్చే వాడని తేలింది. తద్వారా లవ్​జిహాద్‎కు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గడిచిన మూడేండ్లలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు యూపీలోని ఏడు జిల్లాలకు చెందిన వెయ్యి మంది ముస్లిం యువకులకు భారీగా డబ్బులు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీని కోసం ముస్లిం దేశాల నుంచి సుమారు రూ.500 కోట్లు వచ్చినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది. ఇందులో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు తెలుస్తున్నది. పేద మహిళలు, ఒంటరిగా ఉంటున్న యువతులతో పాటు వితంతువులను బాబా టార్గెట్ చేశాడు. మతమార్పిడుల రాకెట్‌‌ను నిర్వహించే క్రమంలో జలాలుద్దీన్‌‌ కోడ్‌‌ భాషను ఉపయోగించేవాడు. లవ్ జిహాద్ కోసం ముస్లిం యువకులకు ఇండో, నేపాల్‌‌ సరిహద్దు నుంచే పేమెంట్లు చేసేవాడని తెలిసింది. 

కొందరికి ఆన్​లైన్ ద్వారా.. మరికొందరికి క్యాష్ పంపిస్తుండేవాడు. చంగూర్​బాబా వెంట నీతు అలియాస్ నస్రీన్ ఉండేది. ఈమెను కూడా ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నది. విదేశాల నుంచి వచ్చిన నిధులను నస్రీనే మేనేజ్ చేసేదని సమాచారం. చంగూర్​బాబాకు ఏ దేశం నుంచి ఎన్నెన్ని నిధులు వచ్చాయి? ఎలా వచ్చాయి? అనేదానిపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్​ఐఏ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.