
- కర్నాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ
- మతపరమైన రిజర్వేషన్లకోసం రాజ్యాంగం మార్చాలన్నరు..
- శివకుమార్ అన్నట్టు అధికార పక్షం ఆరోపణలు
- ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన కర్నాటకపై విమర్శలు
- సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా
- రాజ్యసభలో నడ్డా, కిరణ్రిజిజుపై జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీస్
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన రేకిత్తించాయి. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే, కాంట్రాక్ట్ లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉభయ సభలను అట్టుడికించింది.
దీనిపై అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ సభ్యులు విమర్శించారు. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2 గంటల దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.
రాజ్యసభలో రగడ
ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరిస్తుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారంటూ బీజేపీ సభ్యులు రాజ్యసభలో ఆరోపించారు. డీకే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. జేపీ నడ్డా మాట్లాడుతూ..మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదని అన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. ఇలాంటి చట్టాలను, విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో కర్నాటక సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.
డీకే ఆ వ్యాఖ్యలు చేయలేదు: ఖర్గే
ముస్లింలకు రిజర్వేషన్ల విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సభలో లేవనెత్తగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనికి సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో దీనిపై ఖర్గే స్పందించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని, బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు.
భారత రాజ్యాంగాన్ని మారుస్తానని గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కాగా, ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. డీకే వ్యాఖ్యలపై రిజిజు మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్‌లతో సభ హీటెక్కింది. కాగా, డీకే శివకుమార్ చేసిన ప్రకటనలపై సభను తప్పుదోవ పట్టించారంటూ రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్.. సభాపక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజుపై ప్రివిలేజ్ నోటీస్ లుఇచ్చారు.
లంచ్ తర్వాత రెండోసారి సభ తిరిగి సమావేశం కాగా, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి.. ఆయిల్ ఫీల్డ్స్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు, 2024లో లోక్‌సభ చేసిన సవరణలను ప్రతిపక్షాల నినాదాల మధ్య పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, గందరగోళం కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
నా కామెంట్లను తప్పుగా ప్రచారం చేస్తున్నరు: డీకే శివకుమార్
బెంగళూరు: ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లిం వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే. శివ కుమార్ తెలిపారు. ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తారని తాను ఎప్పుడు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నేనొక సీనియర్ రాజకీయ నాయకుడిని.
గత 36 ఏండ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు రాజ్యాంగంపై అవగాహన ఉంది. దానిని సవరిస్తారని నేను ఎప్పుడూ చెప్పలేదు. వివిధ తీర్పుల తర్వాత రాజ్యాంగాన్ని చాలా సార్లు సవరించారని మాత్రమే నేను మాములుగా చెప్పాను. రాజ్యాంగ సవరణ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రత్యర్థులు నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను దీనిపై పోరాటం చేస్తాను” అని డీకే. శివ కుమార్ చెప్పారు.