V6 News

చపాట.. లాభాల బాట.. ఈ ఏడాది పెరిగిన రేట్లతో అధిక ఫలాలు

 చపాట.. లాభాల బాట.. ఈ ఏడాది పెరిగిన రేట్లతో అధిక ఫలాలు
  • సంప్రదాయ పంటగా సాగు చేస్తున్న రైతులు
  • ఉమ్మడి వరంగల్ లో విస్తృతంగా సాగు 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఓరుగల్లు ప్రత్యేకం చపాట మిర్చి. గతేడాది జియో ట్యాగ్​ గుర్తింపు రావడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్​లో ఈ పంటకు మంచి డిమాండ్​ ఉంది. కానీ, మూడేండ్లుగా పెట్టుబడులు కూడా రాకుండా నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఈ సీజన్​ ప్రారంభం నుంచే పంట రేట్లు పెరగడంతో లాభాల బాట పడుతున్నారు.   

సంప్రదాయ పంటగా..

వ్యవసాయమే జీవనాధారమైన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పూర్వీకుల నుంచి వస్తున్న చపాటను సాంప్రదాయ పంటగా సాగు చేస్తున్నారు. రైతులే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఈ ఏడాది 8450 ఎకరాల్లో చపాటా పంట సాగు చేయగా, అత్యధికంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 1500 ఎకరాల్లో వేశారు. జిల్లాలోని రేగొండ మండలం గూడపల్లి, మొగుళ్లపల్లి మండలం రంగాపూర్, గణపురం మండలం కర్కపల్లి, ధర్మరావుపేట, కొండాపూర్, భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి, శ్యామ్ నగర్ లో ఈ పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారు.

దేశీరకం చపాట ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మూడేళ్లుగా పంట దిగుబడి ఉన్నా, మార్కెట్లో రేట్లు అనుకూలించకపోవడంతో రైతులు నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ సీజన్ ఆరంభంలోనే క్వింటాకు 
రూ.40 వేల ధర పలికింది. ప్రస్తుతం రూ.35వేల నుంచి రూ.37 వేల లోపు ధరతో ఖరీదారులు కొనుగోలు చేస్తున్నట్లుగా రైతులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు చేసుకుంటున్నారు.

విదేశాల్లో డిమాండ్..

చపాట మిర్చికి 2024_25లో జీఐ (భౌగోళిక గుర్తింపు) దక్కడంతో విదేశాల్లో మంచి డిమాండ్ పలుకుతుంది. ఈ మిర్చితో పచ్చళ్ల తయారీతో పాటు కాస్మోటిక్స్​ తయారీలో వినియోగిస్తున్నారు. కారం తక్కువగా ఉండి ఎరుపు రంగు అధికంగా ఉండడంతో కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా విదేశాల్లో దీనిని వాడుతున్నట్లుగా పరిశోధనవేత్తలు చెబుతున్నారు. చపాట విక్రయాలకు వరంగల్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన  వ్యాపారులు డిమాండ్ ను బట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పండించే మిర్చి ఇతర ప్రాంతాల్లో కంటే నాణ్యత ఉండటంతో రైతులతో ఒప్పందం చేసుకున్న కొన్ని కంపెనీలు మిరపను కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మెడిసిన్, రంగుల తయారీలో ఎల్లోకలర్ మిర్చిని సైతం ఈ ఏడాది రైతులు విరివిగా పండించి 
లాభాలు పొందుతున్నారు.

పంట సాగు లాభంగానే ఉంది...  

సాధారణ రకం మిరపతో పోల్చితే కూలీల ఖర్చు చాలా తక్కువ. ఈ ఏడాది రేటు ఉండటంతో లాభంగా ఉంది. ఎకరంలో చపాట సాగు చేశాను. ఇప్పటికే 14 క్వింటాళ్ల వరకు అమ్మిన. మరో మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నల్లిపురుగుతో దిగుబడి తగ్గింది. గతంతో పోల్చితే ఈ ఏడాది పంట సాగు లాభంగానే ఉంది.  - అచ్చ రఘుపతి, రంగాపూర్, మొగుళ్లపల్లి మండలం