వీడిన ఉత్కంఠ: పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్

V6 Velugu Posted on Sep 19, 2021

పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. పంజాబ్‌లో ఇప్పటి వరకూ ఈయనే తొలి దళిత సీఎం. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీశ్ రావత్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కెప్టెన్ అమరిందర్ సింగ్‌ నిన్న సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు కొంత మేర తలనొప్పి తెచ్చిపెట్టింది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరిందర్ సింగ్‌ల మధ్య నడిచిన వివాదాల కారణంగా ఆ రాష్ట్ర సర్కారులో సంక్షోభం ఏర్పడింది. గడిచిన రెండు మూడు నెలలుగా పదే పదే హైకమాండ్ ఎమ్మెల్యేలను, మంత్రులను, పలువురు సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడడం సాగుతూ.. వచ్చింది. రెండు వర్గాల మధ్య వివాదాలు చిలికి చిలికి పెద్దవి అవుతుండడంతో నిన్న సాయంత్రం మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చింది హైకమాండ్. దీంతో ఈ తీరును తనను అవమానించడమేనంటూ కెప్టెన్ రాజీనామా చేశారు. తనపై భరోసా లేకుంటే మీకు నచ్చిన వాళ్లను సీఎంగా పెట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో సీఎంగా అమరిందర్‌‌ చేసిన సేవలకు థ్యాంక్స్ చెబుతూ ఒక తీర్మానం, కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతిలో పెడుతూ మరో తీర్మానం చేశారు.

పంజాబ్‌కు కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ నిన్నటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఈ రోజు ఉదయం పంజాబ్ ఎంపీ అంబికా సోనీతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సీఎంగా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను సీఎం పదవిని సున్నితంగా తిరస్కారించానని, ఒక సిక్కు నేతకే ఆ పదవి అప్పగించాలని హైకమాండ్‌కు సూచించానని ఆమె తెలిపారు. సిద్ధూ సీఎం కావాలని కోరుకున్నప్పటికీ ఆయన పట్ల అమరిందర్‌‌తో పాటు పలువురు సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన పట్ల మొగ్గు చూపలేదు. అయితే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సుఖ్జిందర్ సింగ్ రణ్‌ధావా, పార్టీ నేతలు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రా తదితరులు సీఎం రేసులో ఉన్నారని ప్రధానంగా వినిపించింది. అయితే సుఖ్జిందర్‌‌ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేశారని, ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని వార్తలు వచ్చాయి. కానీ కొద్దిసేపటి తర్వాత ఆయనే మీడియా ముందుకు వచ్చి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మరికొద్ది సేపటిలో హైకమాండ్ సీఎం ఎవరనేది ప్రకటిస్తుందని చెప్పారు. ఎట్టకేలకు హరీశ్ రావత్ ట్వీట్‌తో ఉత్కంఠకు తెరపడింది.

Tagged captain amarinder singh, Charanjit Singh Channi, Punjab new CM

Latest Videos

Subscribe Now

More News