
- చేతులు మారిన రూ.1.63 కోట్లు
- సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్‌కు పంపిన అధికారులు
- ఇప్పటి దాకా16 మంది దళారులు సహా 49 మంది అరెస్టు
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 98 పేజీల చార్జిషీటును శుక్రవారం నాంపల్లి కోర్టుకు అందించారు. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్ సహా మొత్తం 36 మందిపై అభియోగాలు మోపారు. పేపర్ల లీకేజీ ద్వారా రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని అధికారులు కోర్టుకు తెలిపారు. నిందితులు, సేకరించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వివరాలను సమర్పించారు. ఈ కేసులో 49 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడని వివరించారు. అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేశామని చెప్పారు. చార్జ్‌షీట్ వివరాలను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
‘‘ఈ ఏడాది మార్చి 11న టీఎస్ పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో పేపర్ లీకేజీపై నమోదయిన కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సీసీఎస్ నేతృత్వంలోని సిట్ ఏసీపీ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించారు. టీఎస్ పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ), టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ పులిదిండి ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ కలిసి కుట్రపన్ని, కాన్ఫిడెన్సియల్ సెక్షన్‌లో ఉండే కంప్యూటర్‌ను అనధికారికంగా ఓపెన్ చేశారు. అందులో స్టోర్ చేసి ఉన్న గ్రూప్-1, డీఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించారు.
వాటిని పలువురికి అందించారు. మధ్యవర్తులను వాడుకొని ప్రశ్నపత్రాలను అమ్మారు. 16 మంది దళారులుగా, మిగతా వాళ్లు వివిధ పరీక్షలు రాసిన వారిగా గుర్తించాం” అని సిట్ చీఫ్ వెల్లడించారు. ఏఈఈ పేపర్ లీకేజీ దర్యాప్తు చేస్తుండగా బ్యాటరీ ఆపరేటెడ్ సిస్టమ్‌తో హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సేకరించిన ఆధారాలను సీజ్ చేసి రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపామని ఆయన తెలిపారు.
వీరిపైనే అభియోగాలు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన టీఎస్ పీఎస్సీ ఉద్యోగులైన ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌తో పాటు షమీమ్, రమేశ్ కుమార్‌పై చార్జిషీటు దాఖలైంది. మధ్యవర్తులు రేణుకా రాథోడ్, ఆమె భర్త ఢాక్యా నాయక్, కేతవాత్ రాజేశ్వర్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేందర్ నాయక్, డి.తిరుపతయ్య, వై.సాయి లౌకిక్, కోస్గి మైబయ్య, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, కొంతం శశిధర్‌రెడ్డి, రమావత్ దత్తు, పూల రవికిశోర్, గుగులోత్ శ్రీనునాయక్, పూల రమేశ్‌పై చార్జిషీటు ఫైల్ చేశారు.
అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ కొని పరీక్ష రాసిన సాయిబాబు, పొన్నం వరుణ్ కుమార్, గున్‌రెడ్డి క్రాంతి కుమార్ రెడ్డి, అజ్మీర్ పృథ్వీరాజ్, భూక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వాదిత్య నరేశ్ పైనా, అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కొని ఎగ్జామ్ రాసిన కేతావత్ నీలేశ్ నాయక్, పత్లావత్ గోపాల్ నాయక్, అల్లిపూర్ ప్రశాంత్ రెడ్డి, తినేటి రాజేంద్ర కుమార్, కోస్గి వెంకట జనార్దన్, కోస్గి రవికుమార్, రమవాత్ మహేశ్, ముదావత్ శివకుమార్, జాదవ్ రాజేశ్వర్, దనవాత్ భారత్ నాయక్, పషికంటి రోహిత్ కుమార్, గాడే సాయిమధు, లోకిని సతీశ్ కుమార్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ కొని పరీక్ష రాసిన యెదునుతుల సాయి సుష్మిత, దనమనేని రవితేజ, గంబీరం పురంధర్ నూతన్ రాహుల్ కుమార్, అట్ల సుచరిత, లావద్య శాంతి, రాయపురం విక్రమ్, రాయపురం దివ్య, బోడుపల్లి నర్సింగ్‌రావుపై చార్జిషీటు దాఖలు చేశారు.