
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డేల్లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. క్రీజ్ లో నిలబడితే చాలు సెంచరీలు అలవోకగా బాదేస్తుంది. గత రెండేళ్లుగా 50 ఓవర్ల ఫార్మాట్ లో సెంచరీల వర్షం కురిపిస్తున్న ఈ టీమిండియా ఓపెనర్.. ఆదివారం (మే 11) శ్రీలంకపై మరో సెంచరీ కొట్టింది. మహిళల ట్రై సిరీస్ ఫైనల్లో భాగంగా మంధాన ఈ ఘనతను అందుకుంది. 101 బంతుల్లో 116 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. మంధాన వన్డే కెరీర్ లో ఇది 11 వ సెంచరీ కావడం విశేషం.
ఈ సెంచరీతో స్మృతి మంధాన రికార్డ్ సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీల చేసిన ఆల్ టైమ్ జాబితాలో స్మృతి మూడో స్థానానికి చేరుకుంది. నిన్నటి వరకు 10 సెంచరీలతో టామీ బ్యూమాంట్ తో సమంగా ఉన్న స్మృతి.. తాజాగా శ్రీలంకపై సెంచరీతో టాప్ 3 లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం 102 ఇన్నింగ్స్ ల్లోనే ఈ టీమిండియా వైస్ కెప్టెన్ ఈ ఘనత అందుకుంది. 15 సెంచరీలతో తొలి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మెగ్ లానింగ్ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్ సుజీ బేట్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఈ సెంచరీతో టీమిండియా ఓపెనర్ మరో ఘనతను కూడా అందుకుంది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత శ్రీలంకలో వన్డే సెంచరీ సాధించిన రెండవ భారతీయ మహిళగా ఆమె నిలిచింది. ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే స్మృతి మందాన సెంచరీతో పాటు హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 47), హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 41), జెమిమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 44) బ్యాటింగ్ లో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. మల్కి మదార, దేవ్మి విహంగా, సుగంధిక కుమారి అందరూ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Amongst the greats is Smriti Mandhana 💯 #SLvIND pic.twitter.com/5qX7esXfzv
— ESPNcricinfo (@ESPNcricinfo) May 11, 2025