SL vs IND: ట్రై సిరీస్ గెలుచుకున్న భారత మహిళలు.. ఫైనల్లో శ్రీలంక చిత్తు

SL vs IND: ట్రై సిరీస్ గెలుచుకున్న భారత మహిళలు.. ఫైనల్లో శ్రీలంక చిత్తు

వన్డే ట్రై సిరీస్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. ఆదివారం (మే 11) శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్ లో 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమ దాస్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో భారీ ఛేజింగ్ లో శ్రీలంక పోరాటం సరిపోలేదు. నీలాక్షి డిసిల్వా (48), చామరి అథపత్తు (53) రాణించినా భారీ లక్ష్యం కావడంతో శ్రీలంకకు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులు చేసి ఓడిపోయింది.  

343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ హాసిని పెరీరా తొలి ఓవర్లోనే డకౌట్ గా వెనుదిరిగింది. ఈ దశలో గుణరత్నే, కెప్టెన్ అథపత్తు రెండో వికెట్ కు 68 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత నీలాక్షి డిసిల్వాతో కలిసి లంక కెప్టెన్ 53 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 3 వికెట్లను 173 పరుగులతో పటిష్టంగా కనిపించిన లంక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. 19 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివర్లో సుగంధిక కుమారి(27), అనుష్క సంజీవని (28) భారత విజయాన్ని ఆలస్యం చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు.. అమన్ జ్యోత్ కౌర్ మూడు.. శ్రీ చారని ఒక వికెట్ పడగొట్టారు.      
 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. స్మృతి మందాన 101 బంతుల్లో 116 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 47), హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 41), జెమిమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 44) బ్యాటింగ్ లో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మల్కి మదార, దేవ్మి విహంగా, సుగంధిక కుమారి అందరూ తలా రెండు వికెట్లు పడగొట్టారు.