ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్​షీట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్​షీట్
  •     ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు
  •     ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నరు
  •     ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉందన్న పంజాగుట్ట పోలీసులు
  •     భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) లాగర్ రూమ్ ధ్వంసం కేసులో పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రిలిమినరీ చార్జ్​షీట్ దాఖలు చేశారు. ఇన్వెస్టిగేషన్​లో భాగంగా సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, సిటీ టాస్క్​ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్​పై అభియోగాలు మోపారు.

 కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు ఏ6గా ఉన్న ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. పోలీసులు దాఖలు చేసిన చార్జ్​షీట్​ను పరిశీలించాక విచారణకు స్వీకరించనున్నది. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్​పై పోలీసులు సప్లిమెంటరీ చార్జ్​షీట్ దాఖలు చేయనున్నారు.

బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు

నిందితులు భుజంగ రావు, తిరుపతన్న మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు చార్జ్​షీట్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వీరిద్దరి తరఫున డిఫెన్స్ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్‌‌‌‌ తరఫున సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్‌‌‌‌ చేయలేదని తెలిపారు. నిందితుల కస్టడీ ముగియడంతో పాటు జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌ గడువు కూడా కంప్లీట్ అయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి.. బెయిల్ పిటిషన్​పై తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.

కేసు ఆధారాలు, బాధితుల స్టేట్​మెంట్లు సబ్మిట్

చార్జ్​షీట్​లో నిందితుల రిమాండ్ రిపోర్ట్, కస్టడీ స్టేట్​మెంట్స్ సహా కీలక సమాచారాన్ని పోలీసులు కోర్టుకు అందించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్​మెంట్లతో పాటు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్​ను చార్జ్​షీట్​లో పొందుపర్చారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ, ఎస్​వోటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్స్, వాటికి సంబంధించిన ఆధారాలు, బాధితులు, సాక్షుల స్టేట్​మెంట్లను చార్జ్​షీట్​కు జత చేశారు. డిసెంబర్ 4న ఎస్ఐబీ లాగర్ రూమ్ ధ్వంసానికి గల కారణాలను సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు.

హైకోర్టు జడ్జి సూరజ్​ఖాన్ ఫోన్ ట్యాప్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసులు.. వాటిపై ప్రణీత్‌‌‌‌ రావు టీమ్‌‌‌‌ చేసిన ఆపరేషన్స్‌‌‌‌కు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ సూరజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ సహా పలువురు జడ్జీలు, అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు కోర్టుకు తెలిపారు.