
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హత్యకు గురైన రిపబ్లికన్ కార్యకర్త, తన సన్నిహితుడు చార్లీ కిర్క్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు ట్రంప్. గురువారం (సెప్టెంబర్ 11) 9/11 స్మారక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. చార్లీ కిర్క్‌ను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రదానం చేస్తామని తెలిపారు.
చార్లీ తన తరంలో ఒక దిగ్గజమని.. స్వేచ్ఛకు అతడు మద్దతుదారుడని కొనియాడారు. లక్షలాది మందికి యువతకు చార్లీ ఒక ప్రేరణ అన్నారు. చార్లీని చాలా మిస్ అవుతున్నామన్నా ట్రంప్.. ఇవాళ అతడు మన మధ్య లేకపోయినప్పటికీ అతడి స్వరం లెక్కలేనంత మంది హృదయాలలో, ముఖ్యంగా యువకుల హృదయాలలో చార్లీ ఉంచిన ధైర్యం సజీవంగా ఉంటుందని.. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదన్నారు.
కాగా, బుధవారం (సెప్టెంబర్ 10) మధ్యాహ్నం ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో దాదాపు 3,000 మంది ప్రేక్షకుల ముందు ప్రూవ్ మీ రాంగ్ అనే బహిరంగ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కిర్క్ వేదికపై మాట్లాడుతుండగా అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో చార్లీ కిర్క్ అక్కడికక్కడే మరణించాడు.
యావత్ దేశాన్ని దిగ్భాంత్రికి గురి చేసిన చార్లీ మృతిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. చార్లీ కిర్క్‌ను చంపడానికి ఉపయోగించిన బోల్ట్-యాక్షన్ రైఫిల్‌ను గురువారం (సెప్టెంబర్ 11) కనుగొన్నారు ఎఫ్‌బీఐ అధికారులు. కిర్క్‌ను హత్య చేసింది కాలేజ్ స్టూడెంట్‌గా అనుమానిస్తున్నారు. నిందితుడు కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.
కాగా, ఉన్నత పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో యువతలో సంప్రదాయవాద విలువలను పెంపొందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్. గొప్ప సామాజిక వేత్తగా పేరు తెచ్చుకున్న కిర్క్ రిపబ్లికన్ పార్టీ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని కుటుంబంతో కిర్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.