పట్టాలు తప్పిన చార్మినార్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌

పట్టాలు తప్పిన  చార్మినార్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌
  • ఫ్లాట్‌‌ ఫామ్​పై డెడ్‌‌ఎండ్‌‌ వాల్‌‌ను ఢీకొట్టడంతో ప్రమాదం
  • నాంపల్లి రైల్వే స్టేషన్‌‌లో ఘటన 
  • ఆరుగురు ప్యాసింజర్లకు గాయాలు
  • పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
  • పట్టాలు తప్పిన మూడు బోగీలకు రిపేర్లు చేసిన సిబ్బంది

హైదరాబాద్/బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు చెన్నై నుంచి హైదరాబాద్‌‌ దక్కన్‌‌ (నాంపల్లి 12759) రైల్వే స్టేషన్‌‌కు చేరుకున్న చార్మినార్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫాస్ట్ ఎక్స్‌‌ప్రెస్‌‌.. స్టేషన్‌‌లోని ఐదో నంబర్‌‌‌‌ ఫ్లాట్‌‌ ఫాంపైనున్న డెడ్‌‌ ఎండ్‌‌ వాల్‌‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఎస్‌‌2, ఎస్‌‌3, ఎస్‌‌6 బోగీలు పట్టాలు తప్పాయి. అంతకుముందు సికింద్రాబాద్‌‌లోనే చాలా మంది ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

విషయం తెలుసుకున్న అధికారులు నాంపల్లి రైల్వే స్టేషన్‌‌కు చేరుకొని విచారణ చేపట్టారు. లోకోపైలెట్‌‌ తప్పిదం వల్లే ఫ్లాట్‌‌ ఫాంపై నున్న డెడ్‌‌ ఎండ్‌‌ వాల్‌‌ను రైలు ఢీకొట్టి, బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే సీపీఆర్వో సీహెచ్‌‌ రాకేశ్‌‌ తెలిపారు. కాగా, ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఒకరు తీవ్ర గాయపడ్డారని వీరిని లాలగూడా రైల్వే హాస్పిటల్‌‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు, తీవ్ర గాయాలైన ఒకరికి రూ.2.50 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. 

ఐదు గంటలకు పైగా ట్రాక్ పైనే రైలు.. 

దాదాపు 5 గంటల పాటు సిబ్బంది శ్రమించి పట్టాలు తప్పిన మూడు బోగీలను ట్రాక్‌‌పైకి ఎక్కించారు. రైల్వే టెక్నికల్ టీమ్‌‌తో పాటు ఆర్పీఎఫ్‌‌, సీఆర్పీఎఫ్‌‌ సిబ్బంది, జీహెచ్‌‌ఎంసీ డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్(నాంపల్లి ) నుంచి మేడ్చల్, మేడ్చల్ నుంచి హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీస్‌‌లను రద్దు చేశారు. కాగా, పట్టాలు తప్పిన బోగీలకు సాయంత్రం వరకు రిపేర్లుచేసి, రోజు వెళ్లే టైమ్‌‌లోనే చార్మినార్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ను చెన్నై పంపించారు. 

మంత్రి పొన్నం విచారం 

చార్మినార్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు పట్టాలు తప్పడంపై స్టేట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. చివరి స్టేషన్ కావడం, అప్పటికే ప్యాసింజర్లు దిగిపోవడం, తక్కువ స్పీడ్‌‌తో ట్రైన్ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రైల్వే అధికారులను ఆయన కోరారు.