- రైలెక్కి స్వరాష్ట్రం చత్తీస్‌గఢ్‌కు వెళ్లినట్లు అనుమానం
ముషీరాబాద్, వెలుగు: ‘ఇక్కడ మాకు ఫ్రెండ్స్ లేరు.. ఎవరూ ఆడుకోవడం లేదు.. మా ఊరికి వెళ్లిపోతాం’ అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. దోమలగూడ ఇన్‌స్పెక్టర్ ఎండీ అంజాద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన టోటారం, రామ్ దులారి దంపతులు తమ కుమార్తెలు సయితా కుమారి(16), స్నేహ కుమారి(14)తో కలిసి దోమలగూడ పరిధిలోని పరిధ్ బస్తీలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తున్నారు.
స్వస్థలం నుంచి ఇటీవల హైదరాబాద్‌కు రావడంతో బాలికలు ప్రస్తుతం చదువుకోవడం లేదు. వీరికి పొరుగింట్లో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రోహిణి కుమార్తె లత(14)తో స్నేహం ఉంది. అయితే శనివారం మధ్యాహ్నం ముగ్గురు బాలికలు ఎవరికీ చెప్పకుండా దుస్తులు బ్యాగులో సర్దుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆటోలో వెళ్లిపోయారు. సాయంత్రం కూలి పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు కుమార్తెలు కనిపించకపోవడంతో దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలు ముందుగా కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ నుంచి సొంత రాష్ట్రానికి నేరుగా రైలు లేదని తెలుసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు తేలింది. ప్లాట్‌ఫారం నంబర్ 6 వద్ద రైలు ఎక్కుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆధారంగా వారి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
