
మంత్ర తంత్రాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 22 మంది మాయగాళ్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కమిషనరేట్ పరిధిలోని ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరిపై 13 కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు. వీరి నుంచి తాయత్తులు, విభూది, నిమ్మకాయలు, త్రిశూలం, ఇతర పూజ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వివరాల ప్రకారం… రామగుండం కమిషనరేట్ పరిధిలో కొన్ని ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని మంత్రాలు, మాయలు వచ్చని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్నారు.
వివిధ ప్రాంతాలు… వేర్వేరు అవతారాలు
వివిధ ప్రాంతాల్లో బాబాలు వివిధ అవతారాలు ఎత్తుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలోని అడ్డగుంటపల్లిలో దేవుడి పటాలు, పసుపు కుంకుమ పుర్రెలలో ఉంచి , మెడలో పూసల దండలు, చేతిలో దండం, గడ్డం, పెద్ద పెద్ద మీసాలతో చూడగానే భయపడే విధమైన వేషధారణతో ఒకే కుటుంబానికి చెందిన తూర్పటి సమ్మయ్య, శంకర్, సారయ్యలు ప్రజలను దగా చేస్తున్నారు. వారి వద్దకు వచ్చిన బాధితులను కూర్చోబెడతారు. పూజా సామగ్రితో పాటు కోడిని వారిపై తిప్పి నిప్పులపై పెట్టగా అది చనిపోతుంది. కోడిలాగానే మీ ప్రాణం కూడా పోతుందని, మీకు చేతబడి చేశారని నమ్మించి భయభ్రాంతులకు గురిచేస్తారు. డబ్బులు వసూలు చేస్తారు. ఇలా వీరు రోజుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు మంత్రతంత్రాల పేరుతో సంపాదిస్తున్నారు. అలాగే పెద్దపల్లి పట్టణంలో కూనారం రోడ్డు, సూర్య రైస్ మిల్లు వద్ద మేకల శకుంతల, నూదునూరి పద్మ కూడా మెడలో గవ్వల దండలు, రుద్రాక్షలతో చేసిన మాల, ఆకుపచ్చ రంగు చీర ధరించి వారి వద్దకు వచ్చే అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు. 11 గవ్వలు వేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రాంతంలో సయ్యద్ కబీర్ అహ్మద్, ఎండి తన్వీర్ ఇనుప మొలలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. రామగిరి మండలం నవాబ్‌పేటలో బోడకర్తి రవి ప్రకృతి వైద్యం పేరుతో ఆయిల్ రాసి మోసగిస్తున్నాడు. వీరితో పాటు పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన కడమంచి రాజయ్య, అబ్బాస్ అలీ, పిడుగు రాజమౌళి, పిడుగు కుమారస్వామి, జైపూర్‌మండలం ఇందారం గ్రామానికి చెందిన ఎండీ యాకూబ్, గోదావరిఖని ఎల్‌బి నగర్‌లో నివాసముండే వరంగల్‌రూరల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన చెరుకు రాజు, నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన కట్కం సూర్యనారాయణ, తాండూర్‌కు చెందిన ఎండి సుబూర్, రామకృష్ణాపూర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అలీం అన్సారీ, పెద్దపల్లి రేగడి మద్దికుంటకు చెందిన మొటం గంగాప్రసాద్, శ్రీనివాస్, బెల్లంపల్లి కన్నాల బస్తికి చెందిన తీగుట్ల స్వామి, మంచిర్యాల హమాలీ వాడలో నివాసముండే ఖమ్మం జిల్లా ముదికొండ మండలానికి చెందిన చర్ల శ్రీను, పస్తం పుల్లయ్యపై ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మంత్ర, తంత్రాలు, పూజలకు సంబంధించిన తాయత్తులు, ఎముకలు, చెట్ల వేర్లు, విభూది, నిమ్మకాయలు, దారాలు, ఇతర పూజ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.