
బషీర్‌బాగ్, వెలుగు: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. యాకుత్ పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గత నెల 14న స్కామర్స్ ఫోన్ చేసి పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారిగా యూనిఫామ్ తో ఓ వ్యక్తి వీడియో కాల్ చేశాడు. మనీ లాండరింగ్ కేసు నమోదు అయిందని బెదిరించారు.
ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపించారు. తమకు డబ్బులు పంపించాలని, నేరం చేయన్నట్లు రుజువైతే తిరిగి డబ్బులు పంపిస్తామని నమ్మించారు. భయపడిన వృద్ధుడు గత నెల 19 నుంచి ఈ నెల 2 వరకు రూ.21,01,650 బదిలీ చేశాడు. ఆ తరువాత స్కామ్ అని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.
రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని..
అబిడ్స్ కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి క్యూబ్ రీసెర్చ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి అంటూ స్కామర్స్ సంప్రదించారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేశారు. గూగుల్ లో రివ్యూస్ ఇస్తే లాభాలు వస్తాయన్నారు. మొదట కొంత డబ్బు చెల్లించారు. నమ్మకం కలిగాక పెట్టుబడులు పెడితే భారీగా రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. వారిని నమ్మి రూ.10,25,550 ఇన్వెస్ట్ చేశాక మోసం చేశారు. మరో కేసులో అసిఫ్ నగర్ కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి మైఖేల్ పేజ్ ఐటి కంపెనీ పేరుతో ఫోన్ చేశారు. వర్క్‌ఫ్రం హోం బిజినెస్ పేరుతో రూ.1,61,720 పెట్టుబడి పెట్టించి వాటిని మాయం చేశారు.