- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.26 వేల కోట్ల అప్పులు రీస్ట్రక్చర్
- వడ్డీ 7 శాతానికి తగ్గించడంతో ఏటా రూ.4 వేల కోట్ల మిగులు
- కార్పొరేషన్ల ద్వారా 11–12% వడ్డీలకు గత సర్కార్ అప్పులు
- పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, కమర్షియల్ బ్యాంకుల నుంచి భారీగా లోన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో చేసిన భారీ అప్పులు, వాటికి కడుతున్న అధిక వడ్డీల భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మరో రూ.85 వేల కోట్ల రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది.
ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను దాటి, వివిధ కార్పొరేషన్ల పేరిట గతంలో తీసుకున్న ఈ రుణాలను.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రుణాల కిందకు మార్చడం లేదా తక్కువ వడ్డీ రుణాలతో భర్తీ చేయడం ద్వారా వెసులుబాటు పొందాలని ఆర్థిక శాఖ అధికారులు యోచిస్తున్నారు.
కాగా, లోన్ల రీస్ట్రక్చర్‌పై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.26 వేల కోట్ల లోన్లను కేంద్రం రీస్ట్రక్చర్ చేయడంతో సులభంగానే అనుమతులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసి లోన్ల రీస్ట్రక్చర్‌పై విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ గనుక పూర్తయితే రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
గడువు పెంచాలని ప్రపోజల్..
కేవలం వడ్డీ రేట్లను తగ్గించుకోవడమే కాకుండా అప్పులు తీర్చేందుకు ఉన్న కాలపరిమితిని (టెన్యూర్) పొడిగించుకోవడం కూడా ఈ ప్రతిపాదనల్లో మరో ప్రధానాంశం. తాజా ప్రతిపాదనల ప్రకారం అప్పుల రీపేమెంట్ టెన్యూర్ మరో 14 ఏండ్లు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
దీనివల్ల తక్షణమే అసలు, వడ్డీ కలిపి కట్టాల్సిన వాయిదాల (కిస్తీ ) భారం రాష్ట్ర ప్రభుత్వంపై గణనీయంగా తగ్గుతుంది. ఇప్పుడు కట్టాల్సిన మొత్తాన్ని సుదీర్ఘ కాలం పాటు చిన్న మొత్తాల్లో చెల్లించే వెసులుబాటు దక్కుతుంది. ఈ వెసులుబాటు వల్ల ప్రస్తుతం చేతిలో ఉండే నిధులను ఇతర పథకాలకు వాడుకునేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే రూ.26 వేల కోట్లు రీస్ట్రక్చర్..
వడ్డీల భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు రూ.26 వేల కోట్ల అప్పులను విజయవంతంగా రీస్ట్రక్చర్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను తీర్చేసి, వాటి స్థానంలో తక్కువ వడ్డీ రుణాలను తీసుకోవడం (స్వాపింగ్) ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
దీంతో రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా దాదాపు రూ.4 వేల కోట్ల మేర మిగులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఆదా అయిన నిధులను ప్రజా సంక్షేమ పథకాల అమలుకు, ఇతర అభివృద్ధి పనులకు మళ్లించే అవకాశం దక్కుతుంది. రాబోయే రోజుల్లో మిగిలిన రుణాలను కూడా ఇదే పద్ధతిలో రీస్ట్రక్చర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
నాడు అధిక వడ్డీలకు అప్పులు..
గత ప్రభుత్వం విచక్షణారహితంగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రంపై భారం మోపింది. కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ (డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్), సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వంటి సంస్థల పేరుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), ఇతర కమర్షియల్ బ్యాంకుల నుంచి ఏకంగా 11 నుంచి 12 శాతం వరకూ అధిక వడ్డీ రేట్లకు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది.
ఈ అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టడానికే బడ్జెట్‌లో ఏటా రూ.66 వేల కోట్లకు పైన పోతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ రుణాలను రీస్ట్రక్చర్ చేసి, వడ్డీ రేట్లను 7 నుంచి 7.5 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల నేరుగా 4 శాతం మేర వడ్డీ భారం తగ్గుతుంది.
