తహసీల్దార్ పై చీటింగ్ కేసు

తహసీల్దార్ పై చీటింగ్ కేసు
  • పోలీస్ వర్సెస్ రెవెన్యూ
  • తహసీల్దార్ పై చీటింగ్ కేసు
  • తాము చేసిందే కరెక్ట్ అంటున్న రెండు శాఖలు


వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దేవుల చిన్న బుచ్చన్న 40 ఏళ్ల క్రితం మరణించినా ఆయన భూమిని మరొకరి ఆధార్ కార్డుపై రిజిస్ట్రేషన్ చేసిన అమరచింత తహసీల్దార్ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై చిన్న బుచ్చన్న వారసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తాము రూల్స్​ప్రకారమే వ్యవహరించామంటూ ఇటు తహసీల్దార్ సింధూజ, అటు ఎస్సై జయన్న వాదిస్తున్నారు. దీనిపై ఇరు డిపార్ట్ మెంట్ల మధ్య జిల్లాలో ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. అక్రమంగా తహసీల్దార్ పై కేసు నమోదు చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా.. లేని వ్యక్తిని ఉన్నట్లుగా సృష్టించి 6.6 ఎకరాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్  చేసిన తహసీల్దార్ పై కేసు పెట్టక తప్పలేదని పోలీసులు చెప్తున్నారు. 

వివాదం మొదలైందిలా..

పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దేవుల చిన్న బుచ్చన్నకు 28, 29 సర్వే నంబర్లలో 6.6 ఎకరాల భూమి ఉంది. ఈయన 40 ఏళ్ల క్రితం మరణించినప్పటికి నలుగురు కొడుకులు భూమిని వారి పేర్ల మీద  విరాసత్  చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. రెవెన్యూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా 2018లో విరాసత్ కాకుండా అలాగే ఉన్న చిన్న బుచ్చన్న 6.6 ఎకరాల భూమిని వారసుల్లో ఒకరైన వెంకటేశ్​తన ఆధార్ కార్డుతో అనుసంధానం చేయించుకున్నాడు. ఇదే వెంకటేశ్​కు పామిరెడ్డిపల్లి గ్రామంలో 313 ఖాతా నంబర్ పై మరికొంత భూమి ఉంది. ఇప్పటివరకు 8 సార్లు రైతుబంధు డబ్బులు సైతం వెంకటేశ్​ఖాతాలో పడ్డాయి. మిగతా వారసులు విరాసత్ చేయాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా వారి పేరిట భూమి మారలేదు. ఈ నేపథ్యంలో మిగతా వారసులకు తెలియకుండా భూమిని బేబులమ్మ పేరిట 3.15 ఎకరాలు, ఎం కృష్ణమూర్తి పేరిట 2.15 ఎకరాలు 2022 జూన్ 7న వెంకటేశ్​ రిజిస్ట్రేషన్ చేశాడు.

వాస్తవానికి  ఖాతాదారుడి పేరు ఆధార్ కు సరిపోనప్పటికీ తహసీల్దార్ సింధూజతో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్​పూర్తి చేసినట్లు మిగతా వారసులు ఆరోపిస్తున్నారు. బుచ్చన్న పేరుతో ఉన్న భూమిని వెంకటేశ్​ఇతరులకు అమ్ముకోవడాన్ని వెంటనే తహసీల్దార్​దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. స్పందించిన పోలీసులు దీనిని చీటింగ్ గా గుర్తించి తహసీల్దార్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తహసీల్దార్​సింధూజ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషాను కలిసే ప్రయత్నం చేయగా కలెక్టర్ అపాయింట్​మెంట్​ఇవ్వలేదు. ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకొని తహసీల్దార్ తమను మోసం చేశారంటూ వారసులు తహసీల్దార్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ సెలవు పెట్టి వెళ్లిపోయారు. 

గుట్టుచప్పుడు కాకుండా విచారణ

ఈ అంశంపై రెవెన్యూ శాఖలోనూ అంతర్మథనం మొదలైంది. చనిపోయిన వ్యక్తి పేరిట పాస్ బుక్ ఇవ్వడం మొదటి తప్పుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి  పేరిట మరొకరి ఆధార్ కార్డును ఫీడ్ చేయడం రెండో తప్పు కాగా ఇవేం పట్టించుకోకుండా పట్టాదారు ఒకరైతే మరొకరి ఆధార్ ద్వారా చనిపోయిన వ్యక్తి భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం మూడో తప్పుగా అధికారులు తేల్చారు. దీంతో ఈ అంశంపై అధికారులు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరుపుతున్నారు.

మరోవైపు శనివారం తహసీల్దార్​తనపై కేసు నమోదు చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మండల మెజిస్ట్రేట్ అయిన తనను కనీసం వివరణ కోరకుండా కేసు నమోదు చేయడంపై వనపర్తి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై చేసింది సరైందేనంటూ డీఎస్పీ అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో చనిపోయిన వ్యక్తి కాకుండా మరొకరు ఆయన ప్రాపర్టీని అమ్ముకోవడం చీటింగ్ కిందికే వస్తుందని పోలీసులు చెబుతుండడంతో రెండు డిపార్ట్ మెంట్ల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి.