వంద కోట్ల నిధులు..నీళ్లపాలు

వంద కోట్ల నిధులు..నీళ్లపాలు
  • కేటీఆర్​ ఇలాకాలో కొట్టుకుపోతున్న చెక్​డ్యాంలు
  • పనులు సబ్ కాంట్రాక్ట్​కు ఇస్తున్న పెద్ద కంపెనీలు
  • ఇసుకపైనే కడుతుండడంతో నిలబడని నిర్మాణాలు


రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో రూ.100 కోట్ల ప్రజాధనం నీళ్ల పాలవుతోంది. నీటిని నిలిపి ఉంచాల్సిన చెక్​డ్యాంలు చిన్నపాటి వరదలకే కొట్టుకుపోతున్నాయి. మూడు నెలల క్రితం తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్​లో రూ.11 కోట్లతో నిర్మిస్తున్న చెక్​ డ్యాం నిర్మాణ దశలోనే చిన్నపాటి వరదకే రెండు ముక్కలైంది. ఇది మరవకముందే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో మానేరు వాగుపై మూడు నెలల క్రితం నిర్మించిన చెక్​ డ్యాం కొట్టుకుపోయింది. వీకెండ్​తో పాటు.. ప్రతిరోజు జనం ఈ చెక్​ డ్యాం కింద స్నానాలు చేయడం, పిల్లా పాపలతో సందర్శకులు ఎంజాయ్​ చేస్తుంటారు. అదృష్టవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున కొట్టుకుపోయింది. అదే జనం ఉన్నప్పుడు కొట్టుకుపోయి ఉంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని స్థానికులు వాపోతున్నారు. 
డిజైన్​ లోపం.. క్వాలిటీ నిల్​
రాజన్నసిరిసిల్ల జిల్లా కేటీఆర్​ ఇలాకాలో రూ.100 కోట్లకు పైగా వెచ్చించి నిర్మిస్తున్న చెక్​ డ్యాంల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు దక్కించుకుంది ఒకరైతే.. వాటిని సబ్​కాంట్రాక్టర్లు.. లోకల్​లీడర్లు చేస్తున్నారు. దీనికి తోడు డిజైన్​లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మానేరు వాగులో 10 నుంచి 12 మీటర్ల లోతు వరకు ఇసుక ఉంటే కేవలం 7 ఫీట్ల డెప్త్​ నుంచే చెక్​డ్యాం నిర్మాణాలు చేపట్టారు. ఇలాంటి చెక్​డ్యాంలలో నీటి స్టోరేజి కూడా కష్టమేనని, కింద ఇసుక నుంచి ఊటలు పడి.. నీరు ఆగదని నిపుణులు పేర్కొంటున్నారు. 800 మీటర్ల పొడవు ఉన్న చెక్​ డ్యాంలు సైతం ఇలాంటి లోపాలతో నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మొత్తం తీసి.. భూమి లెవల్​నుంచి కడితే కానీ ఈ చెక్​ డ్యాంలు నిలవడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం 50 ఏళ్ల వరద స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెక్​డ్యాంలు నిర్మించాల్సి ఉండగా ఇవేం పట్టనట్లు.. రాష్ట్రం మొత్తం సేమ్​డిజైన్​ఇచ్చి చెక్​ డ్యాంలు నిర్మిస్తున్నట్లు సమాచారం.  రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న సుమారు 22 చెక్​ డ్యాంలలో మెజార్టీ పనులు ఒకటే కంపెనీ దక్కించుకోవడం గమనార్హం. ఈ సంస్థ పేరు మీద పలువురు సబ్​కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. 
రెండు చెక్​డ్యాంలు.. రూ. 22 కోట్ల నష్టం
తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్​లో రెండు నెలల క్రితం రెండు ముక్కలైన చెక్​ డ్యాంతో పాటు శుక్రవారం కొట్టుకుపోయిన చెక్ డ్యాంల నిర్మాణ వ్యయం రూ.22 కోట్లు. కూలినచోట రిపేర్లు చేసినా అవి ఎంతకాలం నిలబడతాయన్నది చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం కూలిన చెక్​డ్యాంలను కాంట్రాక్టర్లతోనే నిర్మింపజేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం డిజైన్​ లోపం ఉందని.. తామేందుకు ఖర్చు భరిస్తామమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్​తో చెక్​డ్యాంలు నిర్మిస్తే వరద ఉధృతిని తట్టుకోలేవని, నీరు కూడా నిల్వ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చెక్​డ్యాంల నిర్మాణాలపై రివ్యూ చేయాలని సూచిస్తున్నారు.
విచారణ జరుపుతున్నం
సిరిసిల్ల చెక్​ డ్యాం కూలిపోవడంపై విచారణ జరుపుతున్నం. ఎన్నడూ రానంత వరద రావడం వల్లే చెక్​ డ్యాం కూలింది. పాత కాంట్రాక్టర్​తోనే నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. డిజైన్​ విషయం ఈఎన్​సీ పరిధిలోనిది. విచారణ అనంతరం అన్ని విషయాలు తెలియజేస్తాం. 
                                                                                                                                           - అమరేందర్​రెడ్డి, ఈఈ ఇరిగేషన్, రాజన్నసిరిసిల్ల