3 రోజుల నష్టాలకు చెక్.. సెన్సెక్స్ 446 పాయింట్లు అప్.. 140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

3 రోజుల నష్టాలకు చెక్.. సెన్సెక్స్ 446 పాయింట్లు అప్.. 140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: ఈక్విటీ మార్కెట్లు మూడు రోజుల నష్టాల నుంచి బయటపడ్డాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్,  ఫైనాన్షియల్ షేర్లలో వాల్యూ బయింగ్​వల్ల మంగళవారం (జులై 29) బెంచ్‌‌మార్క్ బీఎస్‌‌ఈ సెన్సెక్స్ దాదాపు 447 పాయింట్లు పుంజుకొని 81,337.95 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 538.86 పాయింట్లు దూసుకెళ్లి 81,429.88 వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 140.20 పాయింట్లు పెరిగి 24,821.10 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్ సంస్థలలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 2.21 శాతం పెరిగింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, లార్సెన్ అండ్​ టూబ్రో, భారతి ఎయిర్‌‌టెల్  టాటా మోటార్స్ కూడా లాభపడ్డాయి. ఆసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతి  బజాజ్ ఫైనాన్స్ కూడా పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్  ఐటీసీ వెనకబడ్డాయి.  బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 1.10 శాతం, మిడ్‌‌క్యాప్ 0.84 శాతం ర్యాలీ చేసింది. బీఎస్‌‌ఈలోని అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.  ఎఫ్​ఐఐలు సోమవారం రూ.6,082.47 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.  

ఆసియా మార్కెట్లలో, జపాన్‌‌కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్,  హాంకాంగ్‌‌కు చెందిన హాంగ్ సెంగ్ నష్టాల్లో స్థిరపడగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి  షాంఘైకి చెందిన ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా ముగిశాయి. యూరప్‌‌లో మార్కెట్లు సోమవారం లాభపడ్డాయి. యూఎస్​ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.63 శాతం పెరిగి బ్యారెల్‌‌ ధర 70.48 డాలర్లకు చేరుకుంది.