
- విభాగాలవారీగా నెలలో 4 రోజులు సమీక్షలు
- ప్రతినెలా పనితీరుపై రిపోర్టులు, ఆపై చర్యలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారంపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత ఫోకస్ పెట్టింది. ఆస్పత్రుల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి నెలా 4 రోజులు డిపార్ట్‌మెంట్ల వారీగా సమీక్షాసమావేశాలు నిర్వహించాలని, ఈ నెల నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ డిపార్ట్‌మెంట్లలోని హెచ్‌వోడీలు, జిల్లా అధికారులతో సమీక్షల్లో పాల్గొని, ఆస్పత్రుల్లోని సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదా పేపర్ వర్క్ ద్వారా వివరించాలని మంత్రి దామోదర ఇదివరకే ఆదేశించారు. హాస్పిటల్స్‌లో మందులు, సిబ్బంది కొరత, న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తల గురించి మాట్లాడాలని, ఆ సమస్యలను ఏవిధంగా పరిష్కరించారో, ఏం చర్యలు తీసుకున్నారో సమావేశాల్లో చర్చించాలని సూచించారు.
పనితీరును బట్టి చర్యలు
ప్రతినెలా నిర్వహించే సమీక్షల్లో గడిచిన నెలలో ఏ డిపార్ట్‌మెంట్ఎంత పురోగతి సాధించింది, గతంలో ప్రస్తావించిన ఎన్ని సమస్యలు పరిష్కరించింది అనే విషయాలు చర్చించనున్నారు. అలాగే, పెండింగ్ సమస్యల గురించి కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కారణాలేంటి? పరిష్కార మార్గాలేంటి? అనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రాత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని మంత్రి సూచించారు.
ఇలా పురోగతిపై సమీక్షించడం ద్వారా ఆయా డిపార్ట్‌మెంట్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో, ఏ డిపార్ట్‌మెంట్‌లో తక్కువ పని జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుంటుందని మంత్రి భావిస్తున్నారు. ఆయా డిపార్ట్‌మెంట్లు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాయో లేదో పర్ఫామెన్స్ షీట్స్ ద్వారా నిర్ణయించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ షెడ్యూల్..
నెలలో 4 రోజులు సమీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ప్రతినెల మొదటి సోమవారం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్‌వోడీలు, డీఎంహెచ్‌వోలు సమీక్షలో పాల్గొంటారు.
ప్రతి నెలా మొదటి మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల సమావేశం, ప్రతి నెలా రెండో సోమవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు సమావేశం అవుతారు. ప్రతినెల రెండో మంగళవారం ఆయుష్ విభాగంలోని ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి, ఇతర డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీలు సమావేశం నిర్వహించేలా షెడ్యూల్‌ను రెడీ చేశారు.