
- చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం, మహారాష్ట్ర పోలీసులు సోమవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టి ఇద్దరు మావోయిస్ట్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బి.రోహిత్ తెలిపిన వివరాల ప్రకారం..మావోయిస్ట్‌లు భద్రాద్రి జిల్లాలోకి వచ్చారన్న సమాచారం అందడంతో మహారాష్ట్ర పోలీసులతో పాటు భద్రాద్రి జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు సోమవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మావోయిస్ట్ పార్టీకి చెందిన ఓయం భూదు అలియాస్ లోకేశ్, పోడియం రామే అలియాస్ శిల్పగా తేలింది. వీరు చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన వారని, 2024లో వీరు వివాహం చేసుకున్నట్లు గుర్తించారు. మావోయిస్ట్ పార్టీలో ఏసీఎంగా పనిచేస్తున్న ఓయం భూదుపై 90 కేసులు, పార్టీ మెంబర్ అయిన రామేపై 67 కేసులు ఉన్నట్లు చెప్పారు.
కూంబింగ్ చేస్తున్న పోలీసులను హతమార్చడం, ఐఈడీలు పేల్చడంతో పాటు పోలీసులపై కాల్పులు జరిగిన ఘటనల్లో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారని చెప్పారు. జిల్లాలోకి మావోయిస్ట్‌లు ప్రవేశించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు.