గండిపేట, వెలుగు: నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ గౌతమ్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని ఎర్రబోడ, పీఅండ్‌టీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ముగ్గురు ఏసీపీలు, ఒక అడిషనల్ డీసీపీ, 10 మంది సీఐలు, 31 మంది ఏఎస్సైలు, 60 మంది హెడ్ కానిస్టేబుళ్లు, జోనల్ టీం ఏఆర్ కానిస్టేబుళ్లు మొత్తం 250 మందికి పైగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
350 ఇళ్లను చెక్ చేసి, 38 వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. 2 లిక్కర్ కేసులు నమోదు చేశామని, 14 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. పీఅండ్‌టీ కాలనీలో చాలా మంది ఆఫ్రికన్ కంట్రీల నుంచి వచ్చిన వారు ఉంటారనే ఉద్దేశంతో తనిఖీలు చేశామన్నారు. సూడాన్, ఉగాండ నుంచి వచ్చిన ఒక మహిళ, ఇద్దరు పురుషుల వీసా గడువు పూర్తయినా ఇక్కడే ఉంటున్నారని గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు.
హస్మత్ పేట్లో 22 బైక్లు..
అల్వాల్: హస్మత్ పేట్ లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. హస్మత్ పేట్, పాత బోయిన్ పల్లి, అంజయ్య నగర్ ప్రాంతాల్లో పలు కాలనీలు, బస్తీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను సీజ్‌చేసినట్లు డీసీపీ తెలిపారు. బెల్ట్ షాపుల్లోని 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేర చరిత్ర ఉన్న 11 మందితోపాటు 19 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో అధికంగా నివసిస్తున్నందున ప్రజల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇండ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అవతలి వ్యక్తులకు సంబంధించి అన్ని వివరాలు తీసుకోవాలని సూచించారు.
