167 ఆలయాలకు రూ.1.13 కోట్లు అందజేత

167 ఆలయాలకు రూ.1.13 కోట్లు అందజేత

సికింద్రాబాద్, వెలుగు: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్​నగర్​ నియోజకవర్గంలోని 167 ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి13లక్షలు కేటాయించగా, మంగళవారం సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ నిర్వాహకులకు మంత్రి తలసాని చెక్కులు అందజేశారు. అంతకు ముందు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాల్లో భాగంగా సమర్పించనున్న చీర తయారీ పనులను మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను ప్రస్తుతం అనేక దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమన్నారు. ఉత్సవాలకు వారం ముందే ప్రభుత్వ సాయం అందిస్తున్నట్లు చెప్పారు.16న ఓల్డ్​సిటీ బోనాలు జరగనున్నాయని, అక్కడి ఆలయాలకు 10, 11 చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతిఒక్క ఆలయాన్ని పూలు, కలర్​ఫుల్​ లైటింగ్​తో డెకరేట్ ​చేయాలని, పూజలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, ఉప్పల తరుణి, ఆకుల రూప, కిరణ్మయి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు.