
- నాలుగు రోజుల్లో 5 దోపిడీలు
- సీసీ కెమెరాలకు చిక్కిన ఐదుగురు దొంగలు
- రాచకొండ, సైబరాబాద్ పోలీసుల అలర్ట్
- 10 స్పెషల్ టీంలతో గాలింపు ముమ్మరం
అర్ధరాత్రి ఇండ్లల్లో చొరబడి.. కనిపించిన వారిపై అటాక్ చేస్తూ.. దొరికిన కాడికి దోచుకుపోయే చెడ్డీ గ్యాంగ్ సిటీలో మళ్లీ కలకలం రేపుతోంది. గతేడాది రెండు ముఠాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28 దోపిడీలు చేసి జనాలను భయభ్రాంతులకు గురిచేశాయి. 2018 డిసెంబర్లో రాచకొండ పోలీసులు ఒక గ్యాంగ్‌లోని ముగ్గురిని అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు మరో ముఠాలోని ఇద్దరిని జనవరిలో అరెస్ట్ చేశారు. ఇక చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టిందనుకుని కంటినిండా నిద్రపోదామనుకున్న నగర ప్రజలకు ఈమధ్య హయత్‌నగర్ మండలం కుంట్లూరులో జరిగిన వరుస చోరీలు కలవరానికి గురిచేస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో ఇండ్లలోకి చొరబడి 5 తులాల బంగారం, రూ.30వేల నగదు దోచుకెళ్లారు. నాలుగు రోజుల్లోనే 5 దోపిడీలు చేయడంతో మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం నాలుగు చెడ్డీ గ్యాంగులున్నట్టు గుర్తించి 10 స్పెషల్ టీంలను రంగంలోకి దించి వేట కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్,వెలుగు:
అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పోలీసులకు సవాళ్ళు విసురుతున్నాయి. దేశంలో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ బనియన్,బవారియా, ఐ ట్వంటీ,ఇరానీ,యూపీ కటక్ గ్యాంగ్ తో పాటు మరో మూడు దొంగల ముఠా సభ్యులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పండగ సెలవులు,సమ్మర్ హాలిడేస్ టార్గెట్ గా అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన దొంగలు గ్రేటర్ లో చోరీలు చేస్తున్నారు. ఈ నెల 24న హయత్ నగర్ మండలం కుంట్లూరులో జరిగిన వరుస చోరీలు మరువక ముందే తాజాగా సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ పెద్ద షాపూర్ లో దొంగలు రెచ్చిపోయారు. షాపూర్ లోని బొద్దం రాజు,ప్రమోద్ పటేల్ ఇండ్లలోకి చొరబడి రూ.30వేల డబ్బు, 5 తులాల బంగారం దోచుకెళ్ళారు. గుజరాత్ నుంచి వచ్చిన మరో చెడ్డీ గ్యాంగ్ సభ్యులే కుంట్లూరు, షాపూర్ లో చోరీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
10 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు
4 రోజుల్లో జరిగిన ఐదు దోపిడీ కేసులతో గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. గత గురువారం అర్ధరాత్రి కుంట్లూరు గ్రామ శివారులోని యాగ్నిక పీఠం వేద పాఠశాలతో పాటు మరో రెండు ఇండ్లల్లో వరుస దోపిడీలు జరిగిన సంగతి తెలిసిందే. 14 తులాల బంగారు నగలు, రూ.95వేల డబ్బుతో పాటు సెల్ ఫోన్ స్నాచింగ్ చేసి దొంగలు పారిపోయారు. ఈ 3 కేసుల్లో బాధితుల వివరాల ప్రకారం ఐదుగురు సభ్యుల ఇంటర్ స్టేట్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒంటిపై చెడ్డీ బనియన్, తలకు పాగా ఉండడంతో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ గ్యాంగ్ గా తేల్చారు. దీంతో 10 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
పార్థీ గ్యాంగ్ నుంచి..
విస్తృతంగా ప్రచారంలో ఉన్న చెడ్డీగ్యాంగ్ అనేది ఓ ముఠా కాదు. పార్థీ తెగలో నుంచి ఏర్పడిన చిత్త,పేజ్,గాయ్, లగోటి, బెరాడ్ లాంటి ఉప తెగలకు చెందిన కుటుంబాలు చోరీలకు తెగబడుతుండేవి. ఈ దొంగల ముఠాలకు పార్థీ గ్యాంగ్ గా పేరొచ్చింది. ఒక్కో గ్యాంగ్ లో 5 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ ఏడాది 3 నెలలకు వరుస దోపిడీలకు ప్లాన్ చేస్తారు. టార్గెట్ చేసిన సిటీకి వెళ్లి రైల్వే,బస్‌స్టేషన్లలోనే మకాం వేస్తారు. కొందరు శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుంటారు. ఈ ముఠాలోని ఆడవాళ్ళు డే టైమ్ లో బెలూన్లు,కార్ల విండో మ్యాట్స్ అమ్ముతున్నట్టు చేస్తారు. మరికొందరు కాలనీల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తిస్తారు. ఇంటి తీరు,బాల్కనీలో ఆరేసిన దుస్తుల ఆధారంగా ఆ ఇంట్లో వారి ఆర్థిక స్థోమతను అంచనా వేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు చేసిన గుజరాత్ దాహోడ్ సహద చెడ్డీ బనియన్ గ్యాంగ్ ను రాచకొండ ఎస్ వోటీ పోలీసులు గతేడాది డిసెంబర్ లో అరెస్ట్ చేశారు. బదియా ముఠాకి చెందిన కిషన్ బదియా, రావోజీ బదియా, భారత్ సింగ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుజరాత్ లోని దాహూడ్ జిల్లా సహద గ్రామం వీరి సొంతూరిగా గుర్తించారు. కిషన్ బదియాతో పాటు మరో3 ముఠాలు చెడ్డీ గ్యాంగ్ లకు అవతారమెత్తాయి. ఈ 4 గ్యాంగ్స్ లో 15 మంది సభ్యుల వరకు ఉంటారు. వీళ్లంతా దోపిడీల కోసం దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు.
రెండు ముఠాలు అరెస్ట్.. ఐదుగురిపై పీడీ యాక్ట్
రెండు చెడ్డీ గ్యాంగ్స్ గతేడాది రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ లో 13 దోపిడీలు చేశాయి. ఏపీలోని తిరుపతి, గాజువాక, విజయవాడ లాంటి సిటీల్లో 15 ఇండ్లలో చోరీలకి పాల్పడ్డాయి. వరుస చోరీలకు పాల్పడిన రెండు చెడ్డీ గ్యాంగ్స్ లో బదియా ముఠాకి చెందిన కిషన్ బదియా, రావోజీ బదియా, భారత్ సింగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ జీ, దినేశ్, సురేశ్ అనే మరో 3 చెడ్డీ గ్యాంగ్స్ కి చెందిన సభ్యులు హసన నర్సింగ్(27), రాజు సవసింగ్ భరియా(27)ను సైబరాబాద్ పోలీసులు ఈ ఏడాది జనవరి 22న అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ చెడ్డీ గ్యాంగ్స్ కి చెందిన ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి తరలించారు.
పండుగలు..సమ్మర్ హాలీడేస్
ఈ సారి దీపావళి పండగను టార్గెట్ చేసి ఈ నెల మొదటి వారంలోనే చెడ్డీ గ్యాంగ్ సిటీలోకి ప్రవేశించింది. సిటీ శివార్లలోని అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏరియాలను సెలక్ట్ చేసుకుంటారు. చెట్ల పొదలను షెల్టర్ గా చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. వ్యవసాయ బావులు,గ్రామాలకు శివార్లలోని కాలనీల్లో రెక్కీ వేసి తాళాలున్న ఇండ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తారు. అర్ధరాత్రి 1.30గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలను తమ దోపిడీలకు అనువైన టైంగా ఎంచుకుంటారు. ఎవరైనా అడ్డుకుంటే దాడులు చేసేందుకు బ్యాగులో రాళ్ళు,ఇనుపరాడ్లు తీసుకెళ్తారు.ఒంటిపై డ్రెస్ లేకుండా కేవలం చెడ్డీలపైనే ఇండ్లల్లో చోరీ చేస్తారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఒంటి నిండా ఆయిల్ పూసుకుంటారు. కొంతకాలంగా సిటీలో సీసీ కెమెరాల నిఘా ఎక్కువ ఉండడంతో ఇప్పుడు శివారు ప్రాంతాలనే ఈ దొంగల ముఠాలు టార్గెట్ చేశాయి.