డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

 ఓల్డ్​సిటీ, వెలుగు: డిజిటల్ మార్కెటింగ్ పేరుతో ఆకర్షణీయమైన కమీషన్లు ఇప్పిస్తామని నమ్మించి యువతను మోసగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మీర్​చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్ బుధవారం వెల్లడించారు. నిందితులు మహ్మద్ అక్రమ్, మహ్మద్ నౌమాన్ రజా కలిసి ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ప్రచారం ద్వారా భారీగా సంపాదించవచ్చని అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించారు. మొదట ఐడీ సృష్టి కోసం రూ. 200 వసూలు చేసి, ఆపై సులభంగా డబ్బు వస్తుందని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 30,000 చొప్పున సుమారు 30 మంది దగ్గర డబ్బు వసూలు చేశారు. డబ్బు చెల్లించినా ఉత్పత్తులు అందకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రెయిన్ బజార్ స్టేషన్​లో ఆరుగురు, మీర్​చౌక్ స్టేషన్​లో ఐదుగురు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. దీంతో టెక్నికల్ ఆధారాలతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు బెంజ్ కార్లు, ఒక ల్యాప్​టాప్, రెండు ఐఫోన్లు, ముంబైకి చెందిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.