
ఏపీలో నేతన్నలకు ఏడాదికి రూ. 24 వేల పెట్టుబడి సాయం
నేతన్నలకు నిజమైన నేస్తం ఏపీ సీఎం జగన్
సీఎం కేసీఆర్ మాత్రం ఓటు బ్యాంకుగానే చూస్తున్నరు
చేనేతల జేఏసీ చైర్మన్ సురేశ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆడంబరాలు ఆపి, నేత కార్మికులకు ప్రకటించిన పథకాలను అమలు చేయడంపై దృష్టిపెట్టాలని చేనేత కార్మికుల జేఏసీ చైర్మన్ దాసు సురేశ్ డిమాండ్ చేశారు. రైతన్నలకు ఇస్తున్న మాదిరిగానే చేనేత కార్మికులకూ పెట్టుబడి సాయం అందించాలన్నారు. ఏపీలో నేతన్నలకు అండగా నిలుస్తూ “చేనేత నేస్తం” పథకం ద్వారా ఏడాదికి రూ. 24 వేల పెట్టుబడి సాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేసిన ఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం నేతన్నలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఆయన ఇప్పటికైనా కండ్లు తెరవాలన్నారు.
గురువారం హైదరాబాద్ అడిక్మెట్ లోని తన ఆఫీసులో విలేకరులతో సురేశ్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల నేతన్నలకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లలో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా, వాటిని పథకాల అమలుకు ఖర్చు చేయడంలో ఫెయిల్ అయిందన్నారు. నేతన్నలకు కూడా రైతుల మాదిరిగా రూ. 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా, అమలు చేయడం లేదని విమర్శించారు. కాకతీయ మెగాటెక్స్ టైల్స్ పార్క్ కు శంకుస్థాపన చేసి రెండేండ్లు అవుతున్నా, ఇంకా ప్రారంభించలేదన్నారు. సీఎంకు నేతన్నలపై నిజంగానే ప్రేమ ఉంటే రెండు సీజన్లకు సంబంధించి రూ. 36 వేలను నేతన్నల బ్యాంకు అకౌంట్లో వేశాకే వారి గురించి మాట్లాడాలన్నారు. నేతన్నల సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలను, సంఘాలను కలుపుకొని ఢిల్లీ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు.