తనను తానే కిడ్నాప్ చేసుకున్న బాలుడు.. తండ్రికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్

తనను తానే కిడ్నాప్ చేసుకున్న బాలుడు.. తండ్రికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్

టెక్నాలజీని చాలామంది పిల్లలు తమ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తుంటే.. మరికొంత మంది పిల్లలు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి.. తనను తానే కిడ్నాప్ చేసుకున్న విచిత్ర ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు నగరంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం కూడా ఆ విద్యార్థి స్కూల్‌కు వెళ్లాడు. కానీ, సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి ఆ బాలుడి కుటుంబసభ్యులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘మేం మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. మీ అబ్బాయి ప్రాణాలతో ఇంటికి రావాలంటే.. రూ.10 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. వెంటనే భయపడ్డ బాలుడి కుటుంబసభ్యులు.. ట్రిప్లికేన్ పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫోన్ కాల్ చెపాక్ ప్రాంతంలోని టవర్ నుంచి వచ్చిందని తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లారు. అక్కడ కిడ్నాప్‌కు గురైన బాలుడు చెపాక్ స్టేడియం యొక్క బ్లూ గేటు చుట్టూ తిరుగుతూ కనిపించాడు. వెంటనే పోలీసులు బాలుడిని మరియు ఆ ప్రాంత సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అసలు ఏం జరిగిందో చెప్పమని బాలుడిని అడిగితే.. బాలుడు సమాధానం చెప్పకుండా నీళ్లు నమలడం ప్రారంభించాడు. దాంతో ఏం చేయాలో తోచని పోలీసులు.. చెపాక్ స్టేడియం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక ఆటోలో ఈ బాలుడు అక్కడికి వెళ్లినట్లుగా గుర్తించారు. దాంతో ఆ ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌ని గుర్తించి పిలిపించారు. డ్రైవర్‌ని విచారించగా.. ఈ బాలుడితో పాటు మరో మైనర్ బాలుడు ఇద్దరూ కలిసి మొబైల్ యాప్ ద్వారా తన ఆటోను బుక్ చేసుకున్నారని.. అందుకు వారు తనకు రూ. 40 చెల్లించారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

దాంతో పోలీసులు మళ్లీ బాలుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. తన తండ్రి నుంచి సానుభూతిని సంపాదించడానికే ఈ మొత్తం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. మొబైల్ యాప్ ద్వారా తన గొంతును పెద్దవాళ్ల గొంతులాగా మార్చి తండ్రితో మాట్లాడినట్లు బాలుడు తెలిపాడు.

తన తండ్రి ఎప్పుడూ తిడుతూ, కొడుతుండేవాడని.. అందుకే ఆయన సానుభూతిని పొందడానికి బాలుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రిప్లికేన్ పోలీసులు తెలిపారు. బాలుడితో పాటు తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు.. బాలుడిని హెచ్చరించి వదిలేశారు. అంతేకాకుండా బాలుడి తల్లిదండ్రుల చేత ఒక లెటర్ కూడా రాయించుకున్నారు.

For More News..

పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌లో తప్పించుకున్న చిరుత బోనుల పడ్డది

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది