తెలుగు రాష్ట్రాలకు సెన్యార్ తుఫాను ముప్పు తప్పినప్పటికీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.
తుఫాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారులను అధికార యంత్రాంగం సూచించింది. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేగంగా వీస్తాయని.. తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై డిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
డిత్వా తుఫాను అంటే ఏమిటి ?
డిత్వా అనే పేరు యెమెన్ నుంచి పుట్టింది. ఇది ఉత్తర హిందూ మహాసముద్రంలోని ఉష్ణమండల తుఫాను పేర్లలో ఒకటి. అంతే కాకుండా డిత్వా అనేది యెమెన్ లోని సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు, దీన్ని డెత్వా సరస్సు అని కూడా పిలుస్తారు.
తమిళనాడులో హైఅలర్ట్:
తమిళనాడులో డిసెంబర్ 1వ తేదీ వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. నవంబర్ 29, 30 తేదీలలో చెన్నై, తమిళనాడులోని పలు తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
గురువారం ఉదయం 9:10 గంటలకు విడుదల చేసిన వాతావరణ సంస్థ బులెటిన్ ప్రకారం, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, మాహే సహా పలు దక్షిణ ప్రాంతాలలో నవంబర్ 30 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
