గుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు

గుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు

గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. మే 2024 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

తమిళనాడులో గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధంపై పొగాకు వ్యాపారులు, తయారీదారులు  హైకోర్టును ఆశ్రయించారు. వ్యాపారులు, తయారీదారుల పిటిషన్ ను విచారించిన మద్రాసు హైకోర్టు..జనవరి 20 న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్పత్తులను గరిష్టంగా ఒక సంవత్సరం పాటు తాత్కాలికంగా నిషేధించే అధికారం ఆహార భద్రత కమిషనర్ కు ఉండదని హైకోర్టు పేర్కొంది. అందువల్ల నిషేధాన్ని పొడిగిస్తూ తమిళనాడులో జారీ చేసిన నోటిఫికేషన్లు చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.

అయితే మద్రాసు హైకోర్టు తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.., హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్రంలో పొగాకు, గుట్కాపై విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.