2003లో స్థాపించబడిన చెన్నై బేస్డ్ రియల్టీ దిగ్గజం కాసాగ్రాండ్. ఇప్పటికే 160కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసి 53 మిలియన్ చదరపు అడుగుల నివాస భవనాలను నిర్మించిన సంస్థగా పేరుగాంచింది. ఈ సంస్థ తన వార్షిక 'ప్రాఫిట్ షేర్ బోనాన్జా' కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను కంపెనీ ఖర్చులోతో ఒక వారం రోజుల పాటు లండన్ ట్రిప్ కు పంపించాలని నిర్ణయించింది. దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. అరే ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి చెల్లించని కంపెనీలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఓనర్స్ కూడా ఉంటారా అనిపిస్తోంది చాలా మందికి.
గతంలో కూడా ఇలాగే 6 వేల మందికి పైగా సిబ్బందిని కంపెనీ.. సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్, స్పెయిన్‌తో పాటు వివిధ దేశాలకు ట్రిప్స్ లో తీసుకెళ్లింది. ప్రతి సంవత్సరం ఈ బహుమతి పరిధిని పెంచుతూ సంస్థ.. తన విజయాన్ని ఉద్యోగులతో పంచుకోవాలనే ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తోంది. ఈసారి ఇండియాతో పాటు దుబాయ్ ఆఫీసుల్లోని సిబ్బందిని ఈ పర్యటనలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
లండన్ వారసత్వ, సాంస్కృతిక అద్భుతాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించారు. విండ్సర్ క్యాసిల్ ఆడియో గైడెడ్ టూర్, కామ్డెన్ మార్కెట్లు, ఇంటర్‌కాంటినెంటల్ లండన్‌లో గ్రాండ్ డిన్నర్, సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్, లండన్ బ్రిడ్జి, బిగ్ బెన్, బకింగ్‌హామ్ ప్యాలెస్, పిక్కడిల్లీ సర్కస్, ట్రాఫల్గర్ స్క్వేర్, మేడమ్ తుసాడ్స్ ట్రిప్పులో తిప్పనున్నట్లు తెలుస్తోంది. చివరిగా ఉద్యోగులను థేమ్స్ నది క్రూయిజ్ పర్యటనతో ఆనందపరచాలని కంపెనీ ప్లాన్ చేసింది.
ALSO READ : నేపాల్ రూ.100 నోట్లపై భారత్ మ్యాప్..
ప్రతి సంవత్సరం సిబ్బందిని ఇలా ట్రిప్పులకు పంపటం సంతోషంగా ఉందని కాసాగ్రాండ్ వ్యవస్థాపకుడు అరుణ్ అన్నారు. వారి ఆనందం, కన్నీళ్లు మన సంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తాయని చెప్పారు. మొదటిసారి విదేశీ ప్రయాణం చేసే వారిని చూస్తే సంతోషం కలుగుతుందన్నారు. అయితే ఈ ట్రిప్ లో అందరికీ సమాన ఆతిథ్యం, ఒకే గ్రూప్‌లో ప్రయాణం ఉంటుందని ఆయన వెల్లడించారు. కాసాగ్రాండ్ ఈ విధంగా ఉద్యోగుల కృషికి అసలైన ప్రతిఫలం ఇస్తోందని చెప్పారు. సోషల్ మీడియాలో దీనిని చూసిన వారు సూపర్ బాస్ అంటూ కంపెనీ యాజమాన్యాన్ని పొగుడుతున్నారు.
