కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్మురేపింది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ఓపెనర్ సంజు శాంసన్ (48), ఆయూష్ మాత్రే (38), డేవాల్డ్ బ్రేవీస్ (41) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. అంకుల్ రాయ్, వైభవ్, సునీల్ నరైన్ తలో వికెట్ సాధించారు.
ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సరైన ఆరంభం దక్కలేదు. ఫామ్ లేమితో సతమతమవుతోన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచులో కూడా విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అంకుల్ రాయ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన సంజు శాంసన్, ఆయూష్ మాత్రే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
ముఖ్యంగా ఆయూష్ మాత్రే (17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో క్యాచ్ ఔటై పెవిలియన్ చేరాడు. ఢిల్లీపై సెంచరీతో చెలరేగి చెన్నైకు విజయాన్ని అందించిన సంజు శాంసన్ (48) హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు.
ఇక, సీజన్ తొలి నాలుగు మ్యాచులకు దూరమైన స్టార్ బ్యాటర్ బ్రేవీస్ ఫస్ట్ మ్యాచులోనే ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 41 రన్స్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ (23) ఫర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్, వైభవ్ ఆరోరా, అంకుల్ రాయ్ తలో వికెట్ తీశారు. అనంతరం కేకేఆర్ 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది.

