రెచ్చిపోయిన రుతురాజ్..గుజరాత్కు భారీ టార్గెట్

 రెచ్చిపోయిన రుతురాజ్..గుజరాత్కు భారీ టార్గెట్

ఐపీఎల్2023 ఫస్ట్ మ్యాచులో చెన్నై  సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 7  వికెట్లకు 178 పరుగులు సాధించింది.

ఆరంభంలోనే వికెట్..

 టాస్ ఓడిపోయి బరిలోకి దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. షమీ బౌలింగ్లో డివాన్ కాన్వే (1) పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ రుతురాజ్ గైక్వాడ్కు జతకలిశాడు. వీరిద్దరు స్కోరు బోర్డును నడపించారు. అయితే 23 పరుగులు చేసిన మొయిన్ అలీ రషీద్ ఖాన్ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (7)ను కూడా రషీద్ ఖాన్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో  చెన్నై 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్..

ఈ సమయంలో బ్యాటింగ్ భారాన్ని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భుజాన వేసుకున్నాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సులు ఫోర్లతో మోడీ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సులతో 92 పరుగులు సాధించాడు. సెంచరీకి చేరువుగా వచ్చిన రుతురాజ్..అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

చివర్లో ధోని మెరుపులు..

రుతురాజ్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లను కోల్పోయింది.153 పరుగుల వద్ద జడేజా పెవీలియన్ చేరగా..163 పరుగుల దగ్గర  శివం దుబె ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని..7 బంతుల్లో 14 పరుగులు సాధించడంతో..చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలర్లలో షమీ,రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాషువా లిటిల్ ఒక వికెట్లు దక్కించుకున్నారు.