భారీ స్కోరు చేసినా పంజాబ్ చేతిలో చెన్నై ఓటమికి కారణాలు ఏంటంటే..

భారీ స్కోరు చేసినా పంజాబ్ చేతిలో చెన్నై ఓటమికి కారణాలు ఏంటంటే..
  • చెన్నైపై పంజాబ్‌‌‌‌ గెలుపు.. 5 వికెట్లతో గెలిచిన పంజాబ్‌‌‌‌
  • చెలరేగిన శ్రేయస్‌‌‌‌, ప్రియాంశ్‌‌.. మాత్రే, దూబే పోరాటం వృథా

శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (50), ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (43) చెలరేగడంతో ఐపీఎల్‌‌‌‌–19లో చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌కు పంజాబ్‌‌‌‌ కింగ్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచ్చింది. శుక్రవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కేపై గెలిచి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

చెన్నై: తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెత్త బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో చిత్తయిన చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై భారీ స్కోరు చేసినా మరో ఓటమి తప్పించుకోలేకపోయింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో  50), ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 43), ప్రియాంశ్ ఆర్య (11 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39) చెలరేగడంతో  సీఎస్కేకు పంజాబ్ కింగ్స్  చెక్ పెట్టింది. 

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–19లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 209/5 స్కోరు చేసింది. ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే (43 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 73), శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 45 నాటౌట్‌‌‌‌‌‌‌‌), సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 32) రాణించారు. తర్వాత పంజాబ్‌‌‌‌‌‌‌‌ 18.4 ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. ప్రియాంశ్‌‌ ఆర్యకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఆయుష్‌‌‌‌‌‌‌‌ అదరహో..
ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌పై ఓపెనర్‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ (14) రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఔటైనా.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ (28), ఆయుష్‌‌‌‌‌‌‌‌  మాత్రే చెన్నై ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఆదుకున్నారు. రుతురాజ్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లతో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే.. నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లో మాత్రే హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీలతో జోరు పెంచాడు. తర్వాతి ఓవర్లలో భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌, ఫోర్‌‌‌‌‌‌‌‌తో కుదురుకున్నాడు. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో సీఎస్కే 57/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగిన తర్వాత కూడా మాత్రే దూకుడు తగ్గించలేదు. ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో యాన్సెన్‌‌‌‌‌‌‌‌ (1/43)ను లక్ష్యంగా చేసుకుని స్క్వేర్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌, మిడాన్‌‌‌‌‌‌‌‌లో రెండు సిక్సర్లు సంధించాడు.

స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ వేసిన 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మాత్రే 6,6 కొట్టి 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో సీఎస్కే 101/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి పంజాబ్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చేశారు. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 9 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. 

12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో చహల్‌‌‌‌‌‌‌‌ అద్భుతమైన టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి పంపాడు. రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. కొత్తగా వచ్చిన సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడినా.. 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మాత్రేను విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ (2/38) బోల్తా కొట్టించాడు. 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో కార్తీక్‌‌‌‌‌‌‌‌ శర్మ (1)ను యాన్సెన్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 16 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో మూడు వికెట్లు పడటంతో సీఎస్కే స్కోరు 130/4గా మారింది. ఈ దశలో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే బ్యాట్లు ఝుళిపించారు. 15, 16, 17వ ఓవర్లలో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌, మూడు ఫోర్లు కొట్టి వెనుదిరిగాడు. ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 38 రన్స్‌‌‌‌‌‌‌‌ జతయ్యాయి. ఇక్కడి నుంచి దూబే 6, 4, 4, 4, 4, 4 బాదడంతో  స్కోరు రెండొందలు దాటింది.

శ్రేయస్‌‌‌‌‌‌‌‌ నిలకడ..
భారీ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌కు మెరుపు ఆరంభం లభించింది.  4, 6తో ఖాతా తెరిచిన ఓపెనర్‌‌‌‌ ప్రియాంశ్‌‌ ఆర్య.. రెండో ఓవర్లో 4, 6, 4 దంచాడు.  మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌ ప్రియాంశ్‌‌ మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొడితే, ఆపై ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ మూడు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు.  అయితే తన బౌలింగ్‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదిన ప్రియాంశ్‌‌ను హెన్రీ (2/42) ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కూపర్‌‌‌‌‌‌‌‌ కనోలి (36), ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 68/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ 4, 6 కొట్టగా, కనోలి బౌండరీ బాదాడు. అయితే 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగారనౌట్‌‌‌‌‌‌‌‌ కావడంతో స్కోరు 95/2గా మారింది. కనోలికి జత కలిసిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ దూకుడు కొనసాగించాడు.

11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు ఫోర్లతో కనోలి 14 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన కనోలిని అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ (2/31) ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ టైమ్‌‌లో నేహల్‌‌‌‌‌‌‌‌ వదేరా (10)తో కలిసి శ్రేయస్‌‌‌‌‌‌‌‌ మూడు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో 15 ఓవర్లలో స్కోరు 163/3కి పెరిగింది. చివరి 5 ఓవర్లలో 47 రన్స్ అవసరం కాగా శ్రేయస్‌‌‌‌‌‌‌‌ మరింత స్పీడు  పెంచాడు. ఈ క్రమంలో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 26 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ అందుకున్నాడు. కానీ రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ వ్యవధిలో అయ్ర్‌‌‌‌, నేహల్ వెనుదిరగడంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ 186/5తో నిలిచింది. ఇక చివరి 12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 12 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన టైమ్‌‌‌‌‌‌‌‌లో శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (14 నాటౌట్‌‌‌‌‌‌‌‌), స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పంజాబ్‌‌ను ఈజీగా గెలిపించారు. 

సంక్షిప్త స్కోర్లు
* చెన్నై: 20 ఓవర్లలో 209/5 (ఆయుష్‌‌‌‌‌‌‌‌ మాత్రే 73, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే 45*, సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 32, విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ 2/38), పంజాబ్‌‌‌‌‌‌‌‌: 18.4 ఓవర్లలో 210/5 (శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 50, ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ 43, అన్షుల్‌‌‌‌‌‌‌‌ 2/43).

* టీ20 క్రికెట్ చరిత్రలో 200 ప్లస్‌‌‌‌ టార్గెట్లను అత్యధికంగా 9సార్లు ఛేజ్ చేసిన టీమ్ పంజాబ్ కింగ్స్. ఆస్ట్రేలియా 7 సార్లు ఛేజ్ చేసి రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది.

అంపైర్ ఉల్టా పని.. ఆయుష్ బ్యాట్లు ఫెయిల్‌‌‌‌‌‌‌‌!
 సీఎస్కే యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్  ఆయుష్ మాత్రే  బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ చేసిన పొరపాటు పెద్ద గందరగోళానికి దారితీసింది. మ్యాచ్ మధ్యలో బ్యాట్ పరిమాణాన్ని అంపైర్లు గేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెక్ చేస్తుంటారు. మాత్రే క్రీజులోకి వస్తుండగా ఓ అంపైర్ అతని బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరీక్షించగా, అది నిబంధనల ప్రకారం లేదని తేలింది. 

మాత్రే మరో రెండు బ్యాట్లు తెప్పించుకోగా అవి కూడా  రిజెక్ట్ కావడంతో ప్లేయర్లు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశ్చర్యపోయారు. కానీ, అసలు విషయం ఏంటంటే  అంపైర్ ఆ గేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉల్టా (తలకిందులుగా) పట్టుకుని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ విషయం గుర్తించి గేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా తిప్పి చూడగానే  మాత్రే మొదట తెచ్చిన బ్యాట్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు తేలింది. అంపైర్ చేసిన ఈ పొరపాటు వల్ల కాసేపు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలగడమే కాకుండా, స్టేడియంలో నవ్వులు పూశాయి.