మీ చెల్లి సంగతి చూడు.. లిక్కర్​ స్కామ్​లో సూట్ కేసుల గురించి అడుగు: వివేక్ వెంకటస్వామి

మీ చెల్లి సంగతి చూడు.. లిక్కర్​ స్కామ్​లో సూట్ కేసుల గురించి అడుగు: వివేక్ వెంకటస్వామి
  • కేటీఆర్​.. డిసెంబర్ 3 తర్వాత మీ ఖేల్ ఖతం
  • కవితకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయ్?​
  • నీ అధికారమదపు మాటలను ప్రజలు గమనిస్తున్నరు.. మీ తాతలు దిగొచ్చినా 
  • చెన్నూర్​లో మా గెలుపును ఆపలేరు
  • నేను కంపెనీలు పెట్టి 5వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన.. చెన్నూర్​లో ఎంత మందికి ఉద్యోగాలిచ్చినవో చెప్పు
  • నువ్వు, నీ కుటుంబం ప్రజల మీద పడి దోచుకుంటున్నరు.. కేసీఆర్, కేటీఆర్, 
  • బాల్క సుమన్​ను జైలుకు పంపుతమని ఫైర్​

కోల్ బెల్ట్, వెలుగు: ‘వివేక్ సూట్​ కేసులతో వచ్చాడు అంటున్నావ్​.. లిక్కర్ కేసులో రూ.150 కోట్లు ఢిల్లీకి తీసుకెళ్లి కేజ్రీవాల్​కు ఇచ్చిన నీ చెల్లెమ్మ కవితను అడుగు సూట్​ కేసులంటే ఏంటో చెప్తుంది’ అని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మంత్రి కేటీఆర్​పై మండిపడ్డారు. ‘నేను ఒక పారిశ్రామికవేత్తను.. సొంతంగా కంపెనీలు పెట్టి 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన. చట్టబద్ధంగా కంపెనీలు నడుపుకుంటూ ప్రభుత్వాలకు ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల పన్నులు కట్టిన.తెలంగాణ వస్తే నువ్వు, నీ కుటుంబం ప్రజల మీద పడి దోచుకున్నరు. మీ ఇంట్ల అందరికీ ఉద్యోగాలు దక్కించుకున్నరు తప్ప ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిన్రా?’ అని కేటీఆర్​ను నిలదీశారు. 

దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇప్పించానని గొప్పలు చెప్పుకునే కేటీఆర్, చెన్నూరు​లో ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించి ఉంటే చెప్పాలని సవాల్​ విసిరారు. కాకా కుటుంబంపై పిచ్చి కూతలు మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామంలో వివేక్​ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

3న చెన్నూరు ఇసుకాసురుడి పీడ విరగడైతది 

‘‘మూడో తారీఖు తర్వాత ఒక్కొక్కడి సంగతి తెలుస్తానని అధికార మదంతో కేటీఆర్ మాట్లాడడం చెన్నూరు ప్రజలు గమనిస్తున్నరు. కేటీఆర్ అహంకారపూరిత మాటలకు చెన్నూరు జనం ఓటుతో సమాధానం చెప్తరు. 3వ తేదీ తర్వాత మీరు ఖేల్ ఖతం. మారింది చెన్నూరు రూపురేఖలు కాదు.. సుమన్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ 5 ఏండ్లలో వెయ్యికోట్లు అక్రమంగా సంపాదించిండు. 3వ తేదీ తర్వాత చెన్నూరుకు పట్టిన ఇసుకాసురుడి పీడ విరగడవుతుంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులు బాధల్లో ఉన్నప్పుడు, వాళ్లు రోడ్డెకినప్పుడు నువ్వు ఎక్కడ పన్నవ్ కేటీఆర్. కాంగ్రెస్ సబ్బండ వర్గాల కోసం తెలంగాణ వచ్చింది, నీ కుటుంబం, నీ బానిసలు, అనుచరుల కోసం కాదు’’ అని వివేక్​ మండిపడ్డారు. 

‘‘అన్ని సర్వేల్లో సుమన్ ఓడిపోతాడని తేలింది, అందుకే అయ్యా కొడుకులు కేసీఆర్, కేటీఆర్ చెన్నూరు ప్రచారానికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నరు. వాళ్లే కాదు.. వాళ్ల తాతలు దిగివచ్చిన.. చెన్నూరులో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరు. ఈ కల్వకుంట్ల దోపిడీ దొంగల భరతం పట్టేందుకు చెన్నూరు ఓటర్లు రెడీగా ఉన్నరు. సింగరేణి ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగ యువత, కార్మికులు, మహిళలు అంతా సంఘటితమయ్యారు. చెన్నూరు వేదిక నుంచే మీ పతనం మొదలైంది” అని వివేక్​ అన్నారు. 

కేసీఆర్ తప్పు చేసిండని కేటీఆరే ఒప్పుకుండు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీకే ఉద్యోగాలు దక్కాయని వివేక్ ఆరోపించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కమీషన్ల కోసం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ను కాళేశ్వరానికి తీసుకువెళ్లిన కేసీఆర్ లక్ష కోట్లను దండుకున్నాడని ఆరోపించారు. రాత్రి మందేసి తానే ఇంజినీర్​గా మారి కాళేశ్వరం రీడిజైన్ చేయడంతో చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల్లోని పంటలు బ్యాక్​ వాటర్​తో నీట మునిగాయన్నారు. 

కేసీఆర్ కాళేశ్వరం కట్టి తప్పుచేశాడని కేటీఆర్ ఒప్పుకున్నాడని చెప్పారు. ఓట్ల కోసం ఇప్పుడు కేటీఆర్ పంటలు మునగకుండా కరకట్ట కడతానంటున్నాడని, ఇన్నాళ్లు ఎక్కడికి పోయావని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఇసుక దందాతో రూ.వేల కోట్లు దండుకున్న కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్​ను జైలుకు పంపుడే మిగిలి ఉందన్నారు. ఈ నెల 30న కాంగ్రెస్​కు ఓటేసి, కేసీఆర్, బాల్క సుమన్​ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

కాకా చొరవతోనే జైపూర్ పవర్ ప్లాంట్

మంథనికి తరలివేళ్లే పవర్ ప్లాంట్ ను జైపూర్ కు తెచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కుతుందని వివేక్ గుర్తుచేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్లాంట్​ను తెచ్చారన్నారు. సింగరేణి సంస్థ నష్టాల బాటలోకి వెళ్లినప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ.600 కోట్లను అప్పు తెచ్చి సంస్థను కాపాడడమే కాకుండా లక్ష మంది సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత కలిపించాడన్నారు. జీవో లో ఉన్న క్లాజ్ తొలగించి బీఆర్ఎస్ ప్రభుత్వం నాన్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఉండాలని జీవో తెచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

గ్యారంటీల అమలుకు గుడిలో ప్రమాణం

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయని వివేక్​ అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరుతామన్నారు. వైఎస్సార్​ హయాంలో, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ , ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. కేటీఆర్ నిక్కర్లు వేసుకునేటప్పుడే కాంగ్రెస్ దేశంలో సంక్షేమ పథకాల్ని అమలు చేసిందన్నారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఆరు గ్యారంటీలపై పెడతారని, వాటిని అమలు చేస్తామంటూ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లోని విజయ గణపతి ఆలయంలో వివేక్ వెంకటస్వామి ప్రమాణం చేశారు. మందమర్రిలోని 3వ జోన్ రామాలయంలో బాండ్ పేపర్​రాసిచ్చారు. 

జైలుకు పంపే వరకు పోరాటం ఆగదు

ధరణిలో పట్టా భుములను నిషేధిత జాబితాలో పెట్టి దందా చేస్తున్న కేసీఆర్​పై చర్య తీసుకోవాలంటూ నాలుగేండ్లుగా పోరాడుతున్నట్లు వివేక్ చెప్పారు. కాళేశ్వరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, కవిత, కేసీఆర్​పై చర్యలు తీసుకోవాలని బీజేపీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేద న్నారు. లిక్కర్ స్కాంలో మనీశ్ ​సిసోడియాను అరెస్టు చేసినప్పుడు అదే కేసులో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తనపై ఈడీ, ఐటీ రెయిడ్స్ చేయించింది కేసీఆరే అని మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ అవినీతి అక్రమాలపై చర్చకు రావాలని ​సవాల్ ​విసిరారు. జైల్లో కేసీఆర్​కు మందు పోయడానికి బాల్క సుమన్​ను సోపతి పంపుతామన్నారు.