కేసీఆర్ వల్లే నష్టాల్లో సింగరేణి.. సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా జీవో తెచ్చిండు: వివేక్‌‌ వెంకటస్వామి

కేసీఆర్ వల్లే నష్టాల్లో సింగరేణి.. సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా జీవో తెచ్చిండు: వివేక్‌‌ వెంకటస్వామి
  • సీఎం రేవంత్‌‌ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ
  • ప్రజలకు అనుగుణంగా సర్కార్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడి
  • సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించుకుందామని పిలుపు
  • మందమర్రి, రామకృష్ణాపూర్‌‌‌‌లో విజయోత్సవ ర్యాలీ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. స్థానికులకే కాంట్రాక్ట్‌‌ ఉద్యోగాలు కల్పిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్‌‌‌‌ తుంగలో తొక్కి.. ఉద్యోగాలు రాకుండా చేసిందని మండిపడ్డారు.

శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో వివేక్‌‌ పర్యటించారు. ఈ సందర్భంగా మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నివాసంలో, రామకృష్ణాపూర్‌‌‌‌లోని కాంగ్రెస్, సీపీఐ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి వేర్వేరుగా వివేక్‌‌ మాట్లాడారు. ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రయారిటీ ఇవ్వకుండా బయటవాళ్లకు ఇస్తున్నారని జైపూర్, ఇందారం ప్రాంత ప్రజలు తన దృష్టికి తెచ్చారన్నారు. తాడిచర్ల మైన్‌‌ను కేసీఆర్‌‌‌‌ ప్రైవేటు సంస్థలకు అప్పగించారని గుర్తుచేశారు. సింగరేణి, దాని పరిసర ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన రూ.వేల కోట్ల డీఎంఎఫ్‌‌టీ, సీఎస్సార్ ఫండ్స్‌‌ను ఇతర ప్రాంతాలకు మళ్లించి సంస్థకు తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.27 వేల కోట్ల బకాయిలను కేసీఆర్ సర్కార్ చెల్లించకపోవడంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఏండ్ల తరబడి సంస్థలో తిష్ట వేసిన సింగరేణి సీఎండీ శ్రీధర్‌‌‌‌ను ఇంటికి పంపించాలన్నారు. 

సమస్యలను పరిష్కరిస్తా...

సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వివేక్‌‌ హామీ ఇచ్చారు. సింగరేణి నిధులు అదే ప్రాంతంలో ఖర్చు చేసే విధంగా యాజమాన్యాన్ని ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. సంస్థకు పడ్డ బకాయిలను కొద్దికొద్దిగా చెల్లించాలని, రిటైర్డ్‌‌ కార్మికుల పెన్షన్ పెంపుపై కూడా సీఎంను కోరనున్నట్లు తెలిపారు.

కాకా వెంకటస్వామి చొరవతో బొగ్గు గని కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చారని వివేక్‌‌ గుర్తుచేశారు. రామకృష్ణపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికుల కష్టాలను తీర్చేందుకు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. 

ఇకపై రాష్ట్రంలో ప్రజల రాజ్యం.. 

కేసీఆర్ నియంతృత్వ, రాక్షస పాలనకు ప్రజలు అంతం పలికారని వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. ప్రజలను కలవకుండా ఉండేందుకు ప్రగతి భవన్ ముందు ఫెన్సింగ్ వేసి రాజులా వ్యవహరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఫెన్సింగ్ తొలగించడంతో ప్రజలు సంతోష పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్‌‌‌‌తో ప్రజల రాజ్యం ఉంటుందని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

ఎంపీగా పోటీ చేయాలని తాను భావించినప్పటికీ, చెన్నూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా బరిలో దిగినట్లు చెప్పారు. కేవలం 25 రోజుల వ్యవధిలో ప్రజలు తమ ప్రేమను, ఆదరణను పంచి 27 వేల ఓట్ల మోజార్టీతో భారీ విజయాన్ని అందించారన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్, సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు, కార్యకర్తలకు వివేక్‌‌ కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి కార్మిక వాడల్లో బైక్ ర్యాలీ..

చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి మందమర్రి, రామకృష్ణాపూర్‌‌‌‌కు వచ్చిన​వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్, సీపీఐ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా మందమర్రిలోని పాలచెట్టు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్థానిక లీడర్లతో కలిసి ఆయన పూజలు చేశారు.

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి రామకృష్ణాపూర్ లీడర్లు, కార్యకర్తలు ఆర్కే1 సుభాశ్‌‌​నగర్ వద్ద స్వాగతం పలికి సింగరేణి కార్మికవాడల గుండా బైక్ ర్యాలీగా తీసుకువచ్చారు. మందమర్రిలోని అంబేద్కర్ విగ్రహం, రామకృష్ణాపూర్ రామాలయం చౌరస్తా వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ ఎస్సై చంద్రకుమార్, రాజశేఖర్, హరిశేఖర్.. వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

అన్ని వర్గాల ప్రజలు వివేక్‌‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు దుర్గం నరేశ్, రఘునాథ్​రెడ్డి, నల్లాల క్రాంతి, బండి సదానందం, సొత్కు సుదర్శన్, లక్ష్మణ్, గుడ్ల రమేశ్, ఎండీ అబ్దుల్ అజీజ్, ఒడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, నోముల ఉపేందర్ గౌడ్, గోపతి రాజయ్య, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.