నా అరెస్టుకు కుట్ర : వివేక్ వెంకటస్వామి

నా అరెస్టుకు కుట్ర : వివేక్ వెంకటస్వామి
  • నా అరెస్టుకు కుట్ర
  • బీజేపీలో ఉన్నన్ని రోజులు ఎలాంటి దాడుల్లేవ్
  • ఆ పార్టీలో ఉంటే సీతను, వదిలేస్తే రావణుడినా?
  • 2014 ఎన్నికల్లో కేసీఆర్ కు నేనే సాయం చేసిన
  • ఈటలపై భూ కబ్జా ఆరోపణలున్నా.. ఐటీ దాడుల్లేవ్
  • నా వ్యాపారాలన్నీ చట్టపరంగానే  కొనసాగుతున్నాయి
  • ఎవరెన్ని కుట్రలు చేసిన చెన్నూరులో గెలుస్తున్నం
  • కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు

చెన్నూరు/కోల్ బెల్ట్ : తన అరెస్టుకు కుట్ర జరుగుతోందని, ఓటమి భయంతోనే తనపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తాను బీజేపీలో ఉన్నన్ని రోజులు ఎలాంటి దాడులూ లేవని, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేయిస్తున్నాయని ఆరోపించారు.  బీజేపీలో ఉంటే సీతను.. ఆ పార్టీ వదిలేస్తే రావణుడినా... అని ఆయన ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను  చెన్నూరులో గెలవబోతున్నానని చెప్పారు. బీజేపీలో ఉన్నన్ని రోజులు పార్టీకి విధేయంగా పనిచేశానని చెప్పారు. 

హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ కు ఏం ఉండేదన్నారు. అప్పడు తానే  సహాయం చేశానని చెప్పారు. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలతో రెయిడ్ చేయించారని ఫైర్ అయ్యారు. తాను చట్ట ప్రకారం వ్యాపారాలు కొనసాగిస్తున్నందునే కేసీఆర్ తో  నాలుగేండ్లుగా పోరాడుతున్నానని అన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే తాను కాంగ్రెస్ లో చేరినట్టు వివేక్ చెప్పారు. తమ సంస్థల్లో  ప్రతి లావాదేవీ చట్ట  ప్రకారమే జరుగుతుందని అన్నారు. 

ఈటలకు నోటీసులు ఇవ్వలేదేం

హుజూరాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు తాను 27 కోట్లు ఇచ్చానని, అవన్నీ చట్ట ప్రకారం చెక్స్ రూపంలో ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నందునే నోటీసులు ఇవ్వలేదన్నారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల లావాదేవీలు చేసిందని కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చాయని వివేక్ అన్నారు. ఆ కంపెనీ తన మిత్రుడు యశ్వంత్ రెడ్డికి చెందినదని, ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని వివేక్ వెల్లడించారు.  చట్టంలోని నిబంధన ప్రకారం తన స్నేహితుని సంస్థ చూస్కుంటున్నానని చెప్పారు. ఇటీవలే కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్లు లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లు పన్ను చెల్లించామని అన్నారు. 

కుట్రలకు బెదరం

ఎవరెన్ని కుట్రలు చేసినా తాము బెదరబోమని, చెన్నూరు నుంచి తానే గెలవబోతున్నానని వివేక్ చెప్పారు. కేసీఆర్ బాల్క సుమన్ అనే ఇద్దరు రాక్షసులను ఇంటికి పంపిద్దామని ఆయన ఓటర్లకు  పిలుపునిచ్చారు.